గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ కవి గోరటి వెంకన్న, బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఓసీ వైశ్య సామాజిక వర్గం నుంచి బొగ్గారపు దయానంద్‌ను ఎంపిక చేశారు.
గోరటి వెంకన్న
‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..నా తల్లి కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...’ ఈ పాట సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఇలాంటి ఎన్నో గొప్ప పాటలతో ప్రసిద్ధి చెందిన కవి, రచయిత గోరటి వెంకన్న (వెంకటయ్య) నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారంలో 1963లో జన్మించారు. తండ్రి నర్సింహ యక్షగానంలో దిట్ట. వెంకన్న తెలుగులో ఎంఏ పూర్తిచేశారు. అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి, వెల్లంకి తాళం తదితర పుస్తకాలను రచించారు. తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక ఉద్యమ ఆకాంక్షను రగల్చడంలో కీలకంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం రబీర్ సమ్మాన్, తెలంగాణ ప్రభుత్వ కాళోజీ పురస్కారం, ఉగాది పురస్కారం, లోక్‌నాయక్, సినారె సార్మక అవార్డులు పొందారు. అనేక చలన చిత్రాలకు పాటలు రాశారు. ప్రస్తుతం సహకారశాఖలో సబ్‌డివిజనల్‌అధికారిగా ఉన్నారు.
బస్వరాజ్ సారయ్య
వరంగల్ నగరానికి చెందిన చెందిన సారయ్య 1955 డిసెంబరు 5న జన్మించారు. ఐటీఐ, ఇంటర్‌మీడియట్ చదివారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోఉన్నారు. కాంగ్రెస్‌తరఫున 1999లో ఎన్నికై దక్షిణ భారతదేశంలో తొలి రజక సామాజికవర్గ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 2004, 2009లోనూ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఉమ్మడి ఏపీలో 2009 నుంచి 2014 వరకు బీసీ సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 2016లో తెరాసలో చేరారు.
బొగ్గారపు దయానంద్
1954 మే 3న హైదరాబాద్‌లో జన్మించారు. బీఎస్సీ పట్టభద్రుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో ఉపసంచాలకునిగా పనిచేసి 2003లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం వ్యాపారవేత్తగా ఉన్నారు. వాసవీ సేవా కేంద్రానికి జీవితకాల ముఖ్య సలహాదారు. 2014లో తెరాసలో చేరారు.
ముగ్గురి పేర్లను ఆమోదించిన మంత్రివర్గం గవర్నర్‌కు పంపించింది. గవర్నర్ ఆమోదిస్తే శనివారమే ముగ్గురూ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.