హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ ప్రధాన రహదారుల్లో అంధకారం రాజ్యమేలుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 చెక్‌పోస్టు నుంచి మాదాపూర్ వెళ్లే దారిలో వీధి దీపాలు వెలుగకపోవడం వల్ల రాత్రి పూట రోడ్లు చిమ్మచీకటిగా మారాయి. నగరంలో మూడు రోజులుగా లాక్‌డౌన్ అమలుకావడం వల్ల వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సంస్థలు మూసి ఉండటం వల్ల వెలుగుజిలుగులకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఈ రహదారిలో వీధి దీపాలు వెలుగని విషయం బయటపడింది. రాత్రి పూట విధులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు రహదారి కనిపించక... బిక్కు బిక్కుమంటూ వెళ్తున్నారు. వీఐపీలు ఉండే ఈ ప్రాంతంలో చీకట్లు ఏంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.