రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ శాఖ.. పాఠశాల విద్య. రోజంతా పనిచేసినా ఆ శాఖలో దస్త్రాలు పేరుకుపోతుంటాయి. నిత్యం ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల వినతులతో ఊపిరి సలపని పని. అలాంటి శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేక ఆర్నెల్లవుతోంది. గతంలో కమిషనర్‌గా పనిచేసిన విజయకుమార్‌ను గత జనవరి 23న ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఇప్పటివరకు మరొకరిని ఆ పోస్టులో నియమించలేదు. ఆ శాఖకు ఒక్క ఐఏఎస్ అధికారీ లేకపోవడం గమనార్హం. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిని సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్తగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వచ్చిన చిత్రా రామచంద్రన్‌కు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
నాలుగోవంతు
రాష్ట్రంలో పొరుగు సేవలు, ఒప్పంద, శాశ్వత సిబ్బంది కలిపి దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉండగా.. పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే 1.15 లక్షల మంది ఉండటం గమనార్హం. వీరు 25 వేల సర్కారు బడుల్లో పనిచేస్తున్నారు. ఇంకా మరో 10,500 ప్రైవేట్ పాఠశాలలను కూడా పర్యవేక్షించాల్సి ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 58 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ‘జీహెచ్‌ఎంసీకి కమిషనర్ కాకుండా మరో నలుగురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాల విద్యాశాఖకు ఒక్క ఐఏఎస్ అధికారీ లేరు’ అని ఎస్‌సీఈఆర్‌టీ విశ్రాంత ఆచార్యుడు ఉపేందర్‌రెడ్డి ఆవేదన చెందారు. దీనివల్ల పేద విద్యార్థులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడే అత్యంత అవసరం
అసలే కరోనా కాలం.. ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ప్రారంభించాలన్నా.. యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలన్నా పూర్తి స్థాయి కమిషనర్ ఉండాలి. నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలన్నా, సిలబస్ తగ్గింపు, కొత్త తరహా చదువుకు శ్రీకారం చుట్టడం, పుస్తకాల పంపిణీ, డిజిటల్ పాఠ్యాంశాల తయారీపై వేగంగా నిర్ణయాలు జరగాలంటే కమిషనర్ ఉండాలి. ఇక టీచర్ల సర్వీసులు కూడా కమిషనర్ లేక ఆగిపోతున్నాయి. అధికారులు ప్రతి దానికి సచివాలయానికి వెళ్లి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అనుమతి తీసుకోవాలంటే ఆలస్యమవుతోంది.
పూర్తి స్థాయి కమిషనర్ అవసరం
కరోనా పరిస్థితుల్లో పాఠశాలల పునఃప్రారంభంపై ఆలోచనలు చేసి అమలు చేయాలంటే పూర్తి స్థాయి కమిషనర్‌ను నియమించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు పి.రాజాభాను చంద్రప్రకాశ్, రాష్ట్ర కార్యదర్శి రాజ గంగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు