రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమ వెమ్ టెక్నాలజీస్.. నిమ్జ్‌లో నిర్మాణాలు మొదలుపెట్టనున్న తొలి సంస్థగా గుర్తింపు దక్కించుకోనుంది. శంకుస్థాపన చేసేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం జహీరాబాద్ రానున్నారు. పెట్టుబడులను ఆకర్షించాలి... పారిశ్రామికీకరణను వేగవంతం చేయాలి... ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలిని (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్-నిమ్జ్‌ను) ప్రతిపాదించారు. 2013లో అడుగులు పడగా... బుధవారం తొలి పరిశ్రమ నిర్మాణం కోసం భూమిపూజ జరగనుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలను సేకరించాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 3,100 ఎకరాల సేకరణ పూర్తయింది. పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి చూపాయి. ఇప్పటి వరకు వెమ్ టెక్నాలజీస్‌కు మాత్రమే భూకేటాయింపు పూర్తయినట్లు టీఎస్‌ఐఐసీ అధికారి ఒకరు తెలిపారు.
అనుసంధానం కోసం ప్రత్యేక రోడ్డు.. నిమ్జ్ ప్రాంతాన్ని, జాతీయరహదారి 65కు అనుసంధానం చేసేలా ప్రత్యేకంగా వంద అడుగుల రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. జహీరాబాద్ మండలం హుగ్గెళ్లి నుంచి ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ వరకు 9.5 కిలోమీటర్ల పొడవున దీనిని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు పెడితే తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గతంలో చాలాసార్లు స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. తమ బతుకులు ఆగం చేయవద్దని కోరారు. దీంతో పూర్తిగా కాలుష్యరహిత పరిశ్రమలకే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
రూ.1,000 కోట్ల పెట్టుబడితో.. నిమ్జ్‌లో నిర్మాణాలు మొదలుపెట్టనున్న హైదరాబాద్‌కు చెందిన సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ వెమ్ టెక్నాలజీస్‌కు ఝరాసంగం మండలం చీలపల్లి వద్ద 511 ఎకరాలను కేటాయించారు. ఈ ఏడాది జనవరి 23న ఈ ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ నెలకొల్పనున్న యూనిట్‌లో రెండుదశల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. తొలిదశను 2023కల్లా పూర్తి చేసి ఉత్పత్తికి శ్రీకారం చుడతారు.
ఇదీ చూడండి: Harish Rao Fire On Central: కేంద్రం నిరుద్యోగ యువతను మోసం చేస్తోంది: హరీశ్ రావు