రాష్ట్రంలో విధించిన రాత్రివేళ కర్ఫ్యూను పోలీసులు పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఏ కారణం లేకుండా రోడ్లపై సంచరించే వారిని వారిస్తున్నారు. అత్యవసర సేవల కోసం వెళ్లే వారిని అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌లోని మైత్రివనం, లిబర్టీ, కోఠీ, మోజాంజాహీ మార్కెట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అసెంబ్లీ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఇతరత్ర పత్రాలు తనిఖీ చేస్తున్నారు. మహమ్మారి కట్టడిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు. ఔషధాలు, ఆసుపత్రులకు వెళ్లే వారిని మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు. రాత్రి వేళ కర్ఫ్యూతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాధారణ రోజుల్లో భాగ్యనగర ప్రధాన కూడళల్లో అర్థరాత్రి వరకు కనిపించే ఫాస్ట్ పుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ మధ్యమండలం పరిధిలో రాత్రి కర్ఫ్యూ పోలీసులు పక్కా నిబంధనలతో అమలుచేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు రాత్రి 8 గంటలకే నిర్వాహకులు మూసివేస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించేవారిపై యంత్రాంగం కేసులు నమోదుచేస్తోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రంలో భద్రాద్రిలో కర్ఫ్యూ అమలు విధుల్లో స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ జవాన్లు భాగస్వాములవుతున్నారు. ఎవరూ రహదారుల్లో తిరగొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మహరాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వారిని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లరా వద్ద కొవిడ్ తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి అనుమతిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జలుబు, జ్వరం ఉన్న వారిని తిరిగి పంపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ సరిహద్దు వద్ద అధికారులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కరోనా దృష్ట్యా మహారాష్ట్ర దేగ్లూర్ పట్టణం నుంచి మద్నూర్‌కు ప్రయాణికులను తీసుకెళ్లొద్దని సూచించారు.