మహిళల అక్రమ రవాణ కేసులో హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలపై జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. పాతబస్తీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ సలాం అలియాస్ జస్టిన్, అతని భార్య షియూలి ఖటూన్ అలియాస్ శీలా జస్టిన్‌పై నాంపల్లి ఎన్ఐఏ కోర్టులో దర్యాప్తు అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితులు బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా తరలించి.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహించినట్లు ఛార్జ్ షీట్లో ఎన్ఐఏ పేర్కొంది.
బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారానికి సంబంధించి... చత్రినాక పోలీసులు గతేడాది ఏప్రిల్ 21న కేసు నమోదు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ చట్ట సవరణ తర్వాత ఈ కేసులను ఎన్ఐఏకి బదిలీ చేశారు. దేశంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టిన మానవ అక్రమ రవాణ కేసు ఇదే. గతంలో మహమ్మద్ యూసుఫ్ ఖాన్, బిత్తి బేగం, సోజిబ్ షేక్, రాహుల్ అమిల్ ధాలిపై మార్చి 10న ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితులు ఉద్యోగాల ఆశ చూపి బంగ్లాదేశ్‌కు చెందిన పేద యువతులను తీసుకొచ్చి వ్యభిచారంలో దింపినట్లు దర్యాప్తులో తేలింది.
మే 23న ఎన్ఐఏ జరిపిన సోదాల్లో పలువురు బంగ్లాదేశ్ యువతులకు వ్యభిచార గృహం నుంచి విముక్తి లభించింది. సోదాల్లో రాష్ట్రంలో వ్యభిచారంతో ప్రమేయమున్న ఏజెంట్లు, యువతులు, విటుల ఫోన్ నంబర్లతో కూడిన పలు డైరీలు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ.. వాటి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తోంది.