జి.శ్రీనివాస్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌లపై ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ప్రత్యేక నిపుణుడు కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం గత ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు కేఆర్‌ఎంబీ నివేదిక సమర్పించిందని, కానీ పనులు చేపట్టలేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుదోవపట్టిస్తున్నారని ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చారు.
తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. పనులను పూర్తిచేసే పనిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. అందుకోసం అక్కడ మోహరించిన యంత్రాల ఫొటోలను సమర్పించామని, వాటిని పరిశీలించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి, న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డి, శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సంబంధించినవి మినహా ఇతరత్రా ఎలాంటి పనులు చేపట్టడంలేదని, జులై 7వతేదీ నుంచి చిన్నపని కూడా జరగలేదని తెలిపారు. దీనికి సంబంధించి కేఆర్‌ఎంబీ నివేదిక తమకు అందాల్సి ఉందని, వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫొటోలను రికార్డుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
శిక్షలు విధించడంపై ట్రైబ్యునల్‌కు ఉన్న పరిధి ఏమిటి?
కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధారణయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి ట్రైబ్యునల్‌కు ఉన్న పరిధి ఏమిటి? ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలిపే తీర్పులను సమర్పించాలని చివరిగా ధర్మాసనం ఇరుపక్షాలకు సూచించింది. ఈ కేసుకు సంబంధించేగాక, ట్రైబ్యునల్ ఉత్తర్వులను ఉల్లంఘించినపుడు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలిపేలా ఆ తీర్పుల సమాచారం ఉండాలని నిర్దేశించింది.
ఇవీ చూడండి: