Minister Niranjan Reddy: దేవుడి తరువాత దేవుడంతటి వారు రైతులేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 15 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన రైతు బజార్ ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్ పాల్గొన్నారు. నాగరికత పెరిగేకొద్దీ ప్రజలు సుఖప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నారని, సూపర్ మార్కెట్లకు తీసి పోకుండా రైతుబజార్, సమీకృత మార్కెట్లను అందుబాటులోకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆధునిక రైతుబజార్లను అందుబాటులోకి తీసుకువచ్చి కర్షకులకు దళారుల బాధ లేకుండా.. పండించిన కూరగాయలను నేరుగా విక్రయించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
హైదరాబాద్ వాసులకు మెరుగైన వసతుల కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. చుట్టుపక్క ప్రాంతాల్లోని రైతులు, వినియోగదారుల ప్రయోజనాల కోసమే ఆధునిక మార్కెట్‌ను నిర్మించామని మంత్రి తెలిపారు. అనంతరం రైతుబజార్‌లో కలియ తిరిగిన మంత్రి... కూరగాయాలు కొనుగోలు చేశారు.
"హైదరాబాద్ మహానగరంలోనే అధునాతన రైతుబజార్ ఏదంటే.. కూకట్పల్లి రైతుబజార్. రూ. 15 కోట్లతో నిర్మించిన ఈ మార్కెట్‌తో కలిపి నగరంలో మొత్తం రైతుబజార్ల సంఖ్య 17కు చేరాయి. ఇది కట్టే సమయానికి మా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిగనలోకి తీసుకుని.. అత్యాధునాతనంగా రైతుబజార్‌ను నిర్మించాం. ఇంతకుముందు కూకట్పల్లి అంటే ట్రాఫిక్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు.. ఫ్లైఓవర్లు, మెట్రోరైలు, రోడ్ల విస్తరణలతో ఆ సమస్యను కొంత వరకు పరిష్కరించుకున్నాం. భవిష్యత్తులోనూ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అత్యంత ఆధునికంగా ఈ రైతుబజార్‌ను నిర్మించాం." - నిరంజన్‌రెడ్డి, మంత్రి
ఇదీ చూడండి: ఫలవంతంగా కేటీఆర్ అమెరికా పర్యటన.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..