Agritech South 2022 : పాలలో వెన్న శాతం, నీరు ఎంత, ఇతర ఘనపదార్థాలు ఎంత శాతమున్నాయి, వాటి పరిమాణం (ఎన్ని లీటర్లు) ఎంత అనే వివరాలు క్షణాల్లో తెలిపే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఓ ప్రైవేటు సంస్థ. వినియోగదారులు, గ్రామాల్లో నిత్యం పాలు సేకరించే డెయిరీల ప్రతినిధులకు దీంతో పాల నాణ్యతను పరీక్షించడం ఎంతో సులువవుతుంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానంపై వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లతో ‘అగ్రిటెక్ సౌత్’ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడామైదానంలో ఈ ప్రదర్శనను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు దీన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ వర్సిటీ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలిపాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
మొక్కలకు నిరంతరాయంగా నీరు : తమిళనాడులోని విట్ కళాశాలలో వ్యవసాయ డిగ్రీ చదువుతున్న లక్ష్మీసుప్రియ అనే విద్యార్థిని సంరక్షణ ఉండని మొక్కల కోసం కొత్త పరికరాన్ని ఆవిష్కరించింది. మొక్కలను నాటేముందు వాటిని ఒక బుట్ట లాంటి దాంట్లో పెట్టి భూమిలో నాటాలి. ఈ బుట్టను వెదురు ముక్కలు, పాతకాగితాలు, బంకమట్టి, బూడిద, కాల్షియం ఆక్సైడ్‌లతో తయారు చేసింది. ఈ బుట్టలోపల మరో చిన్న కుండీ ఏర్పాటు చేసి అందులో మొక్కను పెట్టి భూమిలో నాటాలి. దానికి నీరు పోస్తే మొదట బుట్టలోకి చేరిన నీరు మెల్లగా బిందువుల రూపంలో మొక్క ఉన్న కుండీలోకి వెళ్లి వేర్లకు అందుతుంది. ఇలా బుట్టలోకి ఒకసారి పోసే నీరు నెల రోజుల దాకా మొక్కకు బిందువుల రూపంలో అందుతుంది. దీనివల్ల నెలకోసారి వర్షం కురిసినా...ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలన్నింటికీ నీరు అంది ఏపుగా పెరుగుతాయని పరిశోధనల ద్వారా లక్ష్మి నిరూపించినట్లు విట్ వ్యవసాయ కాలేజీ డీన్ డాక్టర్ ఎస్.బాబు తెలిపారు. విట్ కాలేజీ విద్యార్థులు వానపాముల ఎరువును సులభంగా తయారు చేసే పద్ధతిని కూడా కనుగొన్నారు.
- ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీఎన్‌ఆర్ నర్సరీ అనే కంపెనీ పరిశోధనలతో పెంచిన జామ, సీతాఫలం, నేరేడు మొక్కలను ఈ ప్రదర్శనలో పెట్టింది. ఒక్కొక్కటి కిలోకన్నా ఎక్కువ బరువుండే పెద్ద జామకాయలు కాసే మొక్క ధర రూ.180.
- తెలంగాణలో ఆయిల్‌పాం సాగు పెంచాలని ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. ఈ పంట సాగు వివరాలు, దిగుబడుల గురించి రైతులు అడిగి తెలుసుకున్నారు.
- ఇటీవల క్వింటా ధర రూ.32 వేలు దాటిన వరంగల్ చపాటా రకం మిరపకాయలను ఉద్యానశాఖ ప్రదర్శనలో ఉంచింది.
మేం కొనం.. మీరు సాగు చేయవద్దనడం గొప్పతనమా? : "మేము ధాన్యం కొనం.. మీరు సాగు చేయవద్దని తెలంగాణకు కేంద్రం చెప్పడం గొప్పతనం కాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ నుంచి వస్తున్న ఉత్పత్తులను ఎలా సద్వినియోగం చేయాలన్న ఆలోచన, ముందుచూపు కేంద్రానికి ఉండాలి. ప్రజల మానసిక, శారీరక శ్రమను వినియోగించుకునే దారులు వెతకడం పాలకుల విధి’ అని పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహిస్తున్న మూడు రోజుల అగ్రిటెక్ సౌత్ సదస్సులో బుధవారం మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. వ్యవసాయాన్ని మించి ఉపాధి కల్పించే రంగం మన దేశంలో ఇంకొకటి లేదని చెప్పారు."
- కేంద్రంపై మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శ
ఇవీ చదవండి :