రాష్ట్రంలోని చాలాచోట్ల వెంటిలేటర్ల వినియోగంలో తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమ వద్దకు వెంటిలేటర్ అవసరమైన రోగులు ఎవరూ రావడం లేదు కాబట్టి ఇప్పటి వరకు వాటిని వాడలేదని కొందరంటే, అవసరమైన టెక్నీషియన్లు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని మరికొందరు అంటున్నారు. గతంలో ఏరియా వైద్యశాలలుగా ఉండి తర్వాత జిల్లా ఆసుపత్రులుగా మారినవే కాదు, పూర్వ జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సమస్య ఉంది. పనిచేయని వెంటిలేటర్లనే కొన్ని చోట్ల బెడ్‌లకు అమర్చారు.
ఆపత్కాలంలో ఉన్నవీ వినియోగించుకోలేకపోవడం, అవసరమైన సిబ్బంది లేకపోవడం వైద్య శాఖ వర్గాల్లోనే చర్చగా ఉంది. వాస్తవానికి కొవిడ్ తీవ్రత ఎక్కువై వెంటిలేటర్ సదుపాయం లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ‘‘ప్రాణం దక్కించుకోవడానికి వెంటిలేటర్ ఉన్న బెడ్ కోసం నిత్యం ఎంతో మంది పడిగాపులు పడుతున్నారు. మా దగ్గర వెంటిలేటర్ పడకలన్నీ నిండిపోయాయి. ఏంచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం’’ అంటూ రాష్ట్రంలో ప్రధాన కొవిడ్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రి మొదలుకొని అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల వరకు చేతులెత్తేయడం వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ, ఇతర ముఖ్య కేంద్రాల్లోనూ ఉన్న ఆసుపత్రులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే హైదరాబాద్‌లోని ఆసుపత్రులపై కొంతైనా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందని వైద్యశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మచ్చుకు కొన్ని చోట్ల పరిస్థితులు ఇలా...
- మంచిర్యాల జిల్లాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 222 పాజిటివ్ కేసులు రాగా, వారం రోజుల్లో వెయ్యికి పైగా వచ్చాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులొస్తున్నా అక్కడ అందుబాటులో ఉండే ప్రధాన అసుపత్రిలో ఇప్పటివరకు వెంటిలేటర్లను వినియోగంలోకి తేలేదు.
- నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో పది ఉంటే ఐదు కొవిడ్ బాధితుల కోసం కేటాయించారు. ఇప్పటివరకు ఒక్కసారీ వినియోగించలేదు. కరోనా బారిన పడినవారు వెంటిలేటర్ వరకు రాలేదనేది సంబంధిత వైద్యుల సమాధానం. వాస్తవానికి నిర్మల్ జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారమే 120 కేసులు కాగా, గత వారం రోజుల్లో 750కి పైగా వచ్చాయి.
- ఆసిఫాబాద్‌లో రెండు వెంటిలేటర్లు ఉంటే రెండూ పనిచేయడం లేదని తెలిసింది.
- ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన రిమ్స్‌లో 110 వెంటిలేటర్లు ఉన్నాయి. ఇందులో కూడా ఎక్కువ వినియోగంలోకి రాలేదు. కారణం సిబ్బంది కొరతేనన్నది సమాచారం. ఇక్కడ అత్యధిక కేసులు నమోదై వైద్యం కోసం ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
- నాగర్‌కర్నూల్‌లో 3వెంటిలేటర్లున్నా ఇక్కడా సిబ్బంది వాడడం లేదని సమాచారం.
- ములుగులో రెండు ఉంటే రెండూ మూలనపడినట్లు తెలిసింది.
- సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో 20 ఉన్నా వినియోగం మాత్రం లేదు. వచ్చినవి అలానే ఉంచారని సిబ్బంది కోసం అధికారులకు విజ్ఞప్తి చేశారని సమాచారం.
- బోధన్‌లో నాలుగు వెంటిలేటర్లుంటే రెండే వినియోగంలో ఉన్నట్లు తెలిసింది.
- అవసరమైన సిబ్బంది లేకపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఆరు వెంటిలేటర్లు వినియోగించడం లేదని తెలిసింది.
- నల్గొండ, సూర్యాపేట జిల్లా ఆసుపత్రుల్లో 97 వెంటిలేటర్లు ఉండగా.. వైద్యులు, సాంకేతిక సిబ్బంది లేక 40కి పైగా పక్కనపెట్టినట్లు తెలిసింది. రెండు ఆసుపత్రుల్లోనూ ఒక్క పల్మనాలాజిస్టు కూడా లేరు.
- వరంగల్‌లోని ప్రధాన ఆసుపత్రి అయిన ఎంజీఎంలోని ఒక కొవిడ్ వార్డులో ఏడు వెంటిలేటర్లు ఉంటే మూడు పనిచేయడంలేదని తెలిసింది.