శాస్త్ర, సాంకేతిక రంగాల పరిశోధనల్లో కీలకమైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) నుంచి వెయ్యి వరకు సాంకేతిక పరిజ్ఞానాలు కంపెనీలకు బదిలీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని 38 ల్యాబ్‌ల్లోని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో వీటిని అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ వంటి సంస్థలు కనుగొన్నవీ ఇందులో ఉన్నాయి. ఇప్పటికే కొన్నింటిని బదిలీ చేయగా.. ఇంకా పెద్ద ఎత్తున బదిలీకి సిద్ధంగా ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ఆయా రంగాల్లో పరిశ్రమల సామర్థ్యాలు పెంపొందనున్నాయి. దేశీయ పారిశ్రామిక అవసరాల కోసం విదేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఇటీవల పలు రంగాల్లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిలో పెద్ద ఎత్తున సామాజిక ఆవిష్కరణలూ ఉన్నాయి.
ఐఐసీటీ నుంచి..
* మధుమేహులు తీసుకునే ఇన్సులిన్‌ను ఫ్రిజ్‌లో ఉంచకుండా సాధారణ ఉష్ణోగ్రతల్లోనే నిల్వ చేసుకునేందుకు దోహదం చేసే మాలిక్యుల్ ఇన్సులాక్‌ను సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్లినికల్ ట్రయల్స్ కోసం పలు ఔషధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని ఇప్పటికే ఐఐసీటీని సంప్రదించాయి.
* వ్యర్థాల నుంచి విద్యుత్తు, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి వంటి సాంకేతికతలు సహా ఇంధన విభాగంలో పలు ఆవిష్కరణలు బదిలీకి సిద్ధంగా ఉన్నాయి.
* గాలిలోని ఆవిరి నుంచి స్వచ్ఛమైన తాగునీటిని తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేసి ఓ సంస్థకు బదిలీ చేశారు.
* తవుడు నూనె(రైస్ బ్రాన్ ఆయిల్) ఉత్పత్తిని పెంచే ఎంజైమాటిక్ డీగమ్మింగ్ సాంకేతికత. దీంతో తక్కువ నీటిని తీసుకుని.. తక్కువ ద్రవ వ్యర్థాలను విడుదల చేయడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికే దీన్ని మార్కెట్లో వాడుతున్నారు.
ఎన్‌జీఆర్‌ఐ నుంచి..
* భూగర్భ జల ప్రవాహ తీరు తెన్నులు, కలుషిత భూగర్భ జలాల పర్యవేక్షణ కోసం నానో జియో ట్రేస్‌లను అభివృద్ధి చేసింది.
* ఇతర ల్యాబ్‌ల నుంచి పలు సామాజిక ఆవిష్కరణలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. పాలల్లో కల్తీని గుర్తించడం, నీటిని శుద్ధి చేసే ఫిల్టర్లు, చెట్టు ఆకారంలో సౌర పలకల ఏర్పాటుతో తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేసే వంటి ఆవిష్కరణలు సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌ల నుంచి వచ్చాయి.
సీసీఎంబీ నుంచి..
* మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే బయోమార్కర్లను సీసీఎంబీ అభివృద్ధి చేసింది.
* చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడి నిచ్చే సాంబమసూరి జన్యుమార్పిడి వరి రకాన్ని ఆవిష్కరించింది. ఈ విత్తనాలు రైతులకు అధిక దిగుబడి ఇవ్వడంతోపాటు నష్టాలను తగ్గిస్తాయి.
* నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా విత్తనాలను శుద్ధి చేసి నాణ్యత అంచనా వేసే డీఎన్‌ఏ మార్కర్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
* కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లోని ఆర్‌టీ-పీసీఆర్‌లో వేగంగా పరీక్ష ఫలితాన్ని తెలిపేలా డ్రైస్వాబ్ పరీక్ష విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత సైతం అందుబాటులో ఉంది.
ఇవీచూడండి: ఈ నెల 26న డబ్ల్యూహెచ్ఓ భేటీ- 'కొవాగ్జిన్'పై నిర్ణయం!