తరగతి గదుల్లో విద్యార్థులు కూర్చునే బల్లలపై వారి పేర్లు రాస్తారు. ఎవరి పేరు ఉన్న చోట వారే కూర్చోవాలి. మరో చోట కూర్చోడానికి వీల్లేదు. ఈ మేరకు పాఠశాలల పునఃప్రారంభంపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ముసాయిదా నివేదిక రూపొందించింది. కరోనా నేపథ్యంలో బడులు తెరవాలంటే విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సిఫారసులు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం వాటిని ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిశీలించి స్థానిక పరిస్థితులను బట్టి మార్పులు చేసుకోవచ్చు. బడుల పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆగస్టు 15 తర్వాత తెరచుకునే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు.
నివేదికలోని ముఖ్యంశాలు
- షిఫ్టు విధానంలో తరగతులు నడపాలి. తరగతిలో సగం మందికి ఒకరోజు, మిగిలిన వారికి మరో రోజు తరగతులు నిర్వహించాలి. అసైన్‌మెంట్లు ఇంటికే ఇవ్వాలి.
- బల్లపై విద్యార్థుల పేర్లు రాస్తారు. అక్కడే విద్యార్థులు కూర్చోవాలి.
- ఇంటర్వెల్‌ను ఒక్కో తరగతికి వేర్వేరుగా ఇవ్వాలి. వాటి మధ్య 10-15 నిమిషాల వ్యవధి ఉండేలా చూడాలి.
- ఏసీ తరగతి గదులు ఉండటానికి వీల్లేదు. తరగతి గదులు, కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉంచాలి.
- విడతల వారీగా తరగతులు ప్రారంభించాలి. అంటే మొదట ఇంటర్, వారం తరువాత 9, 10 తరగతులు, మరో రెండు వారాల అనంతరం 6, 7, 8 తరగతులు, మూడు వారాల అనంతరం 3, 4, 5 తరగతులు, నాలుగు వారాల తరువాత 1, 2 తరగతులు మొదలుపెట్టాలి. తల్లిదండ్రుల అంగీకారంతో చివర్లో నర్సరీ తరగతులను ప్రారంభించాలి.
- భోజనం, ఇతర ఆహార పదార్థాలను విద్యార్థులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోరాదు. బడుల వద్ద తినుబండారాల విక్రయాలు నిషేధం.
- పాఠశాల ప్రాంగణంలోని ఆరుబయట స్థలంలోనూ తరగతులు నిర్వహించుకోవచ్చు.
- హాస్టళ్లు ఉంటే విడతల వారీగా విద్యార్థులను రప్పించాలి. ఒక్కో విద్యార్థి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి.
ఇవీచూడండి: రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణం.. రూ.750 కోట్లు విడుదల