ఎస్సీ(sc) మహిళలపై దాడి జరిగినా... నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్(national sc commission) వైస్ ఛైర్మన్ అరుణ్ హల్దార్(Arun Haldar) అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేట్ బషీర్‌బాద్ పీఎస్ పరిధి దూలపల్లిలో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటిపై రాళ్లు విసిరారనే కేసులో భాజపా(bjp) ఎస్సీ మోర్చాకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారంటూ ఐదుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జాతీయ ఎస్సీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్దార్... ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు.
దిల్ ఖుషా అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షకు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, మేడ్చల్ కలెక్టర్ హరీశ్, మల్కాజిగిరి, బాలానగర్ డీసీపీలు హాజరయ్యారు. ఎమ్మెల్యే హనుమంతరావు, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మధ్య స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా చోటు చేసుకున్న గొడవ, ఇరువర్గాలపై నమోదు చేసిన కేసుల వివరాలను సీపీ మహేశ్ భగవత్ వివరించారు. ఆ తర్వాత పేట్ బషీర్‌బాద్ పీఎస్ పరిధిలోని చోటు చేసుకున్న ఘటనను ఏసీపీ వివరించారు. పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయకపోతే జాతీయ ఎస్సీ కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని అరుణ్ హల్దార్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం