హైదరాబాద్ మూసీ నదిలోకి పారిశ్రామిక, గృహ వ్యర్థాలు చేరి... నది కాలుష్య కాసారంగా మారుతుందని మహ్మద్ నహీం పాషా సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ హరిత ట్రైబ్యూనల్ ప్రధాన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ ఆదర్శ గోయల్ నేతృత్వంలో ధర్మాసనం... ఆదేశాలను వెబ్సైట్ పొందుపరించింది. గతంలో నదీ పరివాహక ప్రాంతాల కాలుష్యంపై ఇచ్చిన ఆదేశాలు, ఆయా సంస్థలు చేపట్టిన పనులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ... మూసీ నది ప్రక్షాళన పనులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గత నివేదికలో 351 నదీ తీర ప్రాంతాలు కాలుష్య కారకాలైనట్టు గుర్తించామన్న ధర్మాసనం... అంచనా వ్యయం అధికంగా వేసినట్టు తెలిపింది. ఒక ఎంఎల్డీకి రూ.45 లక్షల చొప్పున అంచనా వేసినట్టు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలిస్తే సాధారణ ధర కంటే 20 రెట్లు అధికంగా రేటు పెంచారని అసంతృప్తి వ్యక్తం చేసింది.
కాలుష్య నివారణతోపాటు హైదరాబాద్ వద్ద మూసీ నది ప్రక్షాళనకు పూర్తి స్థాయి కార్యచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తించినట్టు ఎన్జీటీ పేర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తునట్టు తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ విలాస్ అప్జల్ పుర్కర్ నేతృత్వంలో... కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం నిర్వహించి... నాలుగు నెలల్లో తొలి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాదాపుగా ఏడాదిలో కమిటీకి అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించింది. ఇతర నిపుణలు, సంస్థల సహకారం తీసుకునే స్వేచ్ఛ కమిటీకి ఎన్జీటీ ఇచ్చింది. నదిలో కలుషితమైన భాగాన్ని శుభ్రపరిచేందుకు ఏదైనా కార్పొరేట్ సంస్థ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఇచ్చే అవకాశాలను అన్వేషించవచ్చని సూచించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 16కి వాయిదా వేస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం