ఏపీలో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు, మతిస్థిమితంలేని వాళ్లని గతంలో చెప్పిన డీజీపీ గౌతమ్ సవాంగ్ నేడు రాజకీయ కుట్ర కోణం అంటూ మాటెందుకు మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. డీజీపీ విడుదల చేసిన నిందితుల జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన వైకాపా నేత దామోదర్ రెడ్డి పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఓంకార క్షేత్రంలో అర్చకులను కొట్టిన అధికార పార్టీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించలేదెందుకని నిలదీశారు. హిందుత్వంపైనే దాడికి దిగిన మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్టలేదని ధ్వజమెత్తారు.
హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోవడం చేతకాని డీజీపీపై ముందు కేసు పెట్టాలని లోకేశ్ అన్నారు. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కోర్టులు సవాంగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు.
- ఇదీ చదవండి : కొలిక్కిరాని చర్చలు- 19న మరోసారి భేటీ!