hyderabad skating player: చిన్ననాటి నుంచే అతనికి స్కేటింగ్ అంటే అమితమైన ఆసక్తి. పత్రికలు, టీవీల్లో స్కేటింగ్ క్రీడాకారుల్ని చూస్తూ వారిలా తానూ ఎదగాలని కలలు కనేవాడు. కుమారుడి ఉత్సాహాన్ని గమనించిన తల్లిదండ్రులు.. రాజశేఖర్ అనే స్కేటింగ్ కోచ్ వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. స్కేటింగ్ పట్ల అతనికున్న ఆసక్తిని గమనించిన శిక్షకుడు... ప్రత్యేక దృష్టి సారించి అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాడు. క్రీడలో మెళకువలు ఒంటబట్టించుకున్న యువకుడు... ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. అతనే హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన చరణ్.
ఒలింపిక్సే లక్ష్యం..
ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న చరణ్... నల్గొండ జిల్లా తరఫున పలుమార్లు స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. బంగారుపతకంతోపాటు రెండు వెండి, మూడు కాంస్య పతకాలు సాధించాడు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించాడు. తల్లిదండ్రులు, కోచ్ ప్రోత్సాహంతోనే తాను లక్ష్యం దిశగా సాగుతున్నానని చరణ్ చెబుతున్నాడు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొంటూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తానంటున్నాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి దేశానికి పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తానని చరణ్ చెబుతున్నాడు.
'స్కేటింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఒలింపిక్స్ పోటీలను టీవీల్లో చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి.. దేశానికి పేరుతీసుకురావాలన్నదే నా లక్ష్యం.'
-చరణ్, స్కేటింగ్ క్రీడాకారుడు.
'కరోనా సమయంలోనూ ప్రాక్టిస్ చేశాడు. ఇంట్లో ఉన్నా ప్రాక్టిస్ చేసేవాడు.. స్కేటింగ్ అంటే చరణ్‌కు అంత పిచ్చి. చరణ్ డైట్ విషయంలో పూర్తిగా శ్రద్ధ తీసుకుంటున్నా.'
- ఉష, చరణ్ తల్లి.
ఇదీచూడండి: హర్లీన్ కౌర్.. అందం, ఆటతో అదరగొడుతున్న ఆల్‌రౌండర్!