కరోనా సమయంలో విలువైన కాలాన్ని వృథా చేయకుండా అనేక రంగాల్లో శిక్షణ పొంది "పిట్ట కొంచెం కూత ఘనం" అనే నానుడిని ఆ చిన్నారి సొంతం చేసుకుంది. హైదరాబాద్ బోయిన్పల్లిలో నివాసముంటున్న సంతోశ్, హర్షితా దంపతుల మొదటి కూతురు షాన్వేత శ్రీ. ఈ చిన్నారి ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే 13 అంశాల్లో తన ప్రతిభాపాటవాలను 22 నిమిషాల్లో ప్రదర్శించి ఏకంగా 13 ప్రపంచ అవార్డులను అందుకుంది.
22 నిమిషాల్లో 13 రకాల టాలెంట్లు...
చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో చిన్నారి షాన్వేత శ్రీ ఇరవై రెండు నిమిషాల్లో మహాభారత పర్వాలలోని పేర్లు, త్రీ ఇన్ టూ త్రీ రూబిక్ క్యూబ్ సాల్వింగ్, తెలుగు నామ సంవత్సరాలు, ప్రపంచ దేశాల పేర్లు, ఆధ్యాత్మిక అన్నమయ్య, త్యాగరాజ కృతులు, కీర్తనలు పాటలు, ఆవర్తన పట్టిక రాయడం, ఆవర్తన పట్టిక మూలికలు పేర్లు, స్తోత్రాలు, భగవద్గీత 12వ అధ్యాయం, హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టకము, పియానోపై భక్తి గీతాలు వాయించడం తదితర అంశాల్లో తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించింది.
చిన్నారి ప్రతిభకు రికార్టులు సలాం...
బహుళ ప్రతిభ ప్రదర్శించిన షాన్వేత శ్రీని జస్టిస్ మధుసూదన్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ వరల్డ్ రికార్డ్, కోహినూర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, సూపర్ కిడ్జీ రికార్డ్, గోల్డెన్ స్టార్ రికార్డ్ తదితర రికార్డు ప్రతినిధులు బింగి నరేందర్ గౌడ్, గుర్రం స్వర్ణ శ్రీ బి విజయ రంగ తదితరులు ఆ చిన్నారి ప్రతిభను పర్యవేక్షించారు. ఇరవై రెండు నిమిషాల్లో 13 అంశాలపై తన ప్రతిభను ప్రదర్శించి అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ చిచ్చర పిడుగు.
సమాజంలో ప్రతి ఒక్కరికీ ప్రథమ గురువు తల్లి అని జస్టిస్ మధుసూదన్ పేర్కొన్నారు. చిన్నారుల ప్రతిభాపాటవాలను సరైన సమయంలో గుర్తించిన నాడే వాటికి సరైన గుర్తింపు దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తల్లితోపాటు గురువును గౌరవించాలని సూచించారు.