తెలంగాణ రాష్ట్ర పీసీసీ కొత్త బాస్ పేరును ఇవాళో రేపో అధిష్ఠానం ప్రకటిస్తుందన్న నేపథ్యంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతన పీసీసీ నియామకంపై ఏఐసీసీ స్థాయిలో వీరిద్దరిపైనే కసరత్తు జరుగుతోంది. ఎవరిని నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది..? సీనియర్లందరిని కలుపుకుని ముందుకు పోతారు..? తదితర అంశాలపైనే ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చిన తరువాత... రాజ్‌భవన్ బయట కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త పీసీసీ చీఫ్‌గా వారిద్దిరిలో ఒకరికి దక్కే అవకాశం ఉన్న పరిస్థితుల్లో... ఇద్దరూ ప్రత్యేకంగా పక్కకు వెళ్లి మాట్లాడుకోవడం అందరిని ఆకర్షించింది. పీసీసీ ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని ఇద్దరి మధ్య ప్రస్తావన వచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.