కేంద్ర ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను తప్పుపట్టే వారిపై దేశద్రోహం కేసులు పెట్టి వేధిస్తున్నారని లోక్సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నమోదైన దేశద్రోహం కేసుల వివరాలు కోరుతూ... రేవంత్రెడ్డి లేవనెత్తిన అంశం సభలో ఇవాళ చర్చకు వచ్చింది. కేసుల విషయంలో హోంమంత్రిత్వ శాఖ నుంచి తనకు లభించిన సమాధానం అరకొరగా ఉందని రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.
'ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించినా... ప్రశ్నించినా... బాధ్యత గుర్తుచేసినా... అది దేశ ద్రోహం కిందకు రాదన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం ఎవరు విమర్శలు చేసినా... 124 (ఏ) కింద కేసులు నమోదు చేస్తోంది. ఇవన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసులు. రైతుల ఉద్యమానికి మద్ధతిచ్చారన్న ఒకే ఒక్క కారణంతో దిశ రవిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వాన్ని కోర్టు తప్పుపట్టింది.
-రేవంత్ రెడ్డి
2021 జనవరి 26న రైతుల ర్యాలీ సందర్భంగా చాలా మంది రైతులపై దేశద్రోహం కేసులు నమోదు చేశారని... వాటిని ఎత్తివేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఎంతో మందిపై పెట్టిన ఈ కేసులు విచారణకు రాకుండా... నాలుగైదేళ్ల పాటు పెండింగ్లోనే పెడుతున్నారన్నారు. కేసులు ఉన్నాయన్న కారణంగా ఉద్యోగాలు రాక, పాస్పోర్టు, వీసాలు రాక యువత ఇబ్బంది పడుతున్నారని సభలో రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.