AP HIGH COURT VERDICT ON AMRAVATI ISSUE: అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ తీర్పు ముందే ఊహించిందన్న ఆయన ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఇదే తీర్పు పునరావృతమవుతుందన్నారు.
హైకోర్టు కీలక తీర్పు..
అమరావతిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని...అలాంటప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం కుదరదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించిందని న్యాయవాదులు తెలిపారు. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. పూలింగ్ భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని...తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిట్ ఆఫ్ మాండమస్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపైనా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లకుండా ప్రజల ఆకాంక్షను గౌరవించాలని న్యాయవాదులు సూచించారు.
ఇదీ చూడండి: AP High Court Verdict on Amaravati : 'రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదు'