HC ON MP RAGHURAMA: తనపై దేశద్రోహంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు సుమోటోగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకున్నా.. తనపై పెట్టిన సెక్షన్లేవీ చెల్లుబాటు కావన్నారు. దేశద్రోహం, తదితర సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చెల్లుబాటు కాదన్నారు. ఈ నెల 11న పోలీసులు ఇంటికొచ్చి మంగళగిరి సీఐడీ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చారన్నారు. నరసాపురం నియోజకవర్గానికి తాను వెళ్తున్నట్లు అధికారులకు చెప్పాకే నోటీసు ఇచ్చినట్లు కనపడుతోందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సీఐడీ కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో, వ్యక్తిగత హోదాలో సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పిటిషన్లో ఏముందంటే
‘అధికారపార్టీ సభ్యుల అక్రమాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి మీడియా సమావేశాలు నిర్వహించి నా విధినిర్వహణలో భాగంగా ప్రజలకు తెలియజేస్తుంటాను. వీటిపై నామీద దేశద్రోహం కేసు నమోదుచేసి, అరెస్టుచేశారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిలు మంజూరుచేసి, దర్యాప్తునకు సహకరించాలని నన్ను ఆదేశించింది. తర్వాత ఏడు నెలల నుంచి దర్యాప్తునకు రావాలని సీఐడీ ఎప్పుడూ పిలవలేదు. నా నియోజకవర్గానికి వెళ్లాలనుకున్న సమయంలో గతంలో నాపై పలు కేసులు నమోదుచేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాను. నా వ్యవహారంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. నియోజకవర్గానికి వస్తున్నానని, శాంతిభద్రతల కోసం తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి కలెక్టర్, ఎస్పీకి ఈ నెల 10, 11 తేదీల్లో ఫోన్ ద్వారా తెలియజేశా.
* ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులపై సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ పలు తప్పుడు కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు. కులం పేరుతో ఆయన్ని దూషించానన్న దాంట్లో వాస్తవం లేదు.
* ఎస్సీ రిజర్వేషన్‌ను దుర్వినియోగం చేసి సునీల్‌కుమార్ ఐపీఎస్‌లో చేరారని కేంద్ర హోంశాఖకు నేను చేసిన ఫిర్యాదు పరిశీలనలో ఉంది. వివిధ ఠాణాల్లో పెట్టినట్లే.. మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదుచేసిన దేశద్రోహం కేసు కూడా సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ ప్రేరణతో నమోదు చేసిందే. దీని వెనుక ఆయన దురుద్దేశం ఉంది’ అని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: