ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై కోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిసిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. త్వరగా విచారణ జరిగి నిజానిజాల నిగ్గు తేలాలని కోరుకుంటున్నానని.... నా మీద కూడా నిఘా ఉందని.... నా టెలీఫోన్లు కూడా ట్యాప్‌లో ఉన్నాయని ఆయని తెలిపారు.
రాజమండ్రిలో ఆవ భూముల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని, మెట్టప్రాంతంలోనే నడుము లోతు నీరు వచ్చిందని, గోదావరికి దూరంగా ఉన్నా, అక్కడ కురిసిన వర్షానికే ఈ పరిస్థితి తలెత్తిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రైతులకు రూ. 20 లక్షలు ఇచ్చినా, పైన రూ. 20-25 లక్షల చేతివాటం చూపారని రాజమండ్రి ప్రజలే ఘోషిస్తున్నారని ఎంపీ అన్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దల సహకారం ఉందనేది ప్రజలు గట్టిగా చెబుతున్నారన్నారు. దోపిడీ కోసమే ఏమాత్రం నివాసయోగ్యం కాని ఆవ భూములను నివాసస్థలాలుగా సేకరించారని దుయ్యబట్టారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న దోషులను పట్టుకుని డబ్బును ప్రభుత్వ ఖజానాలో తిరిగి జమచేయాలని ఏపీ సీఎం జగన్‌ను కోరారు. మీ పక్కనే ఉండి అవినీతికి పాల్పడ్డ ఆ కట్టప్పను కనిపెట్టాలని... ఇలాంటి కట్టప్పలు చాలా మందే ఉన్నారని అన్నారు.
- వారి వల్లే సీఎంకు చెడ్డపేరు...
ఇసుక సరఫరా విషయంలో సీఎం గారూ.. పారదర్శకతతో లారీలకు జీపీఆర్ఎస్‌కు విధానం తెచ్చారు. కానీ జీపీఆర్ఎస్ ఇసుక లారీకి కాకుండా బైక్‌కి పెట్టి, సంబంధిత వ్యక్తి ఇంటి వరకు వెళ్లి వస్తోంది. ఇసుక లారీ మాత్రం బ్లాక్ మార్కెట్‌కు వెళుతోంది. కోటాను కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగిందనేది నిజం. నిజాయతీ గల అధికారులకు అప్పగించి విచారణ జరిపించమని చెప్పండి. మీ అధికారుల వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వ అధికారుల సలహా, సూచనలు తీసుకోండి. మీకు తెలీకుండా జరుగుతుందనేది నూటికి నూరుపాళ్ల నిజం. పక్కనున్నవారి వల్ల మీకు చెడ్డపేరు వస్తోందని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
- రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ
కావలిలో సుమారు 97 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడుంటే, వేరే చోట అతి ఎక్కువ ధరకు 50-60 లక్షలకు కొనాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిసిందని ఎంపీ అన్నారు. ఆ భూమిని గతంలో రూ. 10 - 12 లక్షలకు కొని, ఇప్పుడు వాటిని అధిక ధరకు సేకరించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని కథనాలు వచ్చాయని అన్నారు. విశాఖపట్నంలో భూసేకరణకు రూ. 80-90 కోట్లు వెచ్చిస్తే, తూర్పుగోదావరి జిల్లాలో రూ. 2000 కోట్ల పైనే ఖర్చు చేయాల్సి వచ్చిందని, కావలి పక్కనే ఉన్న వెంకటగిరిలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ భూమినే కేటాయించారని అన్నారు. వ్యవస్థలో ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉండాలని... పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేక ప్రభుత్వ స్థలాలు అమ్మడానికి కూడా సిద్ధపడితే, ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై ప్రజాప్రతినిధిగా తానే స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేస్తే.. ఏం విచారణ జరిపారు? ఇదా పారదర్శక పాలనా? మా జిల్లా వ్యవహారాలు చూసే కట్టప్పలు మీకు వేరే కథలు చెబుతున్నారని అన్నారు. నన్ను విలన్‌గా చిత్రీకరిస్తున్న ఆ కట్టప్పలు ఎవరో తెలుసుకుంటే రాష్ట్రాన్ని కాపాడినవాళ్లు అవుతారని.. భూసేకరణ విషయంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే అక్రమాలను మీ దృష్టికి తెచ్చానని అన్నారు.. ఉభయగోదావరి జిల్లాల్లో జరిగిన అక్రమాలతో మొదలుపెట్టి దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు.
ఇవీ చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చండి.. హైకోర్టులో పిల్.. నేడు విచారణ