గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గంటా హరికృష్ణ తల్లి ఇటీవలే ఆత్మహత్య చేసుకొన్నారు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరామర్శకు బయల్దేరారు. చిరుమామిళ్ల గ్రామ సమీపంలోకి ఎంపీ కారు రాగానే... ముందుగానే అక్కడ కాపుకాసిన ఎమ్మెల్యే విడదల రజిని వర్గీయులు ఆయన్ని అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలోకి ఎలా వస్తారని ఎంపీని మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ సింగారెడ్డి కోటిరెడ్డి ప్రశ్నించారు. కేవలం పరామర్శ కోసం మాత్రమే తాను వచ్చానని ఎంపీ చెప్పినా పట్టించుకోలేదు. వాహనానికి అడ్డుపడి ఎంపీతో వాగ్వాదానికి దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారుకు అడ్డుగా ఉన్న వారిని పక్కకు తీసుకెళ్లారు. వారికి సర్దిచెప్పి ఎంపీని పరామర్శకు పంపించారు. గంటా హరికృష్ణను ఎంపీ కృష్ణదేవరాయులు పరామర్శించి వెళ్లిపోయారు. అనధికార కార్యక్రమాలకు సైతం ఇబ్బందులు కలిగించటం మంచి పద్ధతి కాదని ఎంపీ హితవు పలికారు.
గతంలోనూ ఇంతే...
ఈ ఏడాది ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా... చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నంలో వైకాపా నాయకుడు బైరా కృష్ణ ఇంటికి వచ్చిన ఎంపీ లావు కృష్ణదేవరాయలను ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి తన అనుయాయులతో దాడికి యత్నించారు. రెండు గంటలకుపైగా ఎంపీ కారులోనే ఉండిపోయారు. అప్పుడు కూడా పోలీసులు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి ఎంపీని వెనక్కి పంపించేశారు.
ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చిలకలూరిపేట వెళ్లిన ప్రతిసారి ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పురుషోత్తపట్నంలో జరిగిన సంఘటన పై పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. ఈసారైనా కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి అంటున్నారు ఎంపీ వర్గీయులు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి: డీజీపీ