ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నష్టం లేకుండా కేంద్రం చూస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సరైన సమయం వస్తే ఉద్యోగులే కర్మాగారంలో భాగస్వాములయ్యే అవకాశం ఉందని చెప్పారు. విశాఖ భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్ కోసం కేంద్రం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు.
విశాఖలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగిందని తెలిపారు. దేశంలో ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ పథకాలు, వేల కోట్లు నిధులు ఏపీకి ఇస్తుంటే .. తిరిగి భాజపాకు ఏం ఇచ్చామనే విషయాన్ని ప్రజలు కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారమైపోయాని, ధన రాజకీయాలకు స్వస్తి పలికాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో భాజపాను ప్రజలకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. 12 కార్పొరేషన్, 74 మున్సిపాలిటీల్లో జనసేన, భాజపా కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని.. ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగదని, అదే సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అభివృద్ధి పై కేంద్రం దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు.