MP Arvind comments on parties: తాము బలపడటానికి ఏ పార్టీనైనా చీలుస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒక పార్టీ ఎదగడానికి మరో పార్టీని చీల్చటంలో తప్పులేదన్నారు. తన జన్మదినం సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని.. మునుగోడులో భాజపా విజయం సాధిస్తుందని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ భాజపా బలపడటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఏపీలోనూ అధికారంలోకి వస్తామన్నారు.
ఈ సందర్భంగా విజయవాడతో తనకున్న అనుబంధాన్ని అర్వింద్ గుర్తు చేసుకున్నారు. ఈడీ, సీబీఐలను భాజపా పావులుగా వాడుకుంటుందా ? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అదేం లేదని సమాధానమిచ్చారు. భాజపా అధినాయకత్వం ఏం చెబితే తాము అది పాటిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలను భాజపా అమ్మటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలన్న మరో ప్రశ్నకు ప్రాంతీయ పార్టీలు చేసినవే తాము చేస్తున్నామని అర్వింద్ బదులిచ్చారు.
అన్ని పార్టీలను వీక్ చేయడమే మా కర్తవ్యం. మేం స్ట్రాంగ్ కావడమే మా పని. ఇక్కడ భాజపా ఎదగడానికి, రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. దిల్లీలో ఉన్న అధిష్ఠానం ఏం చెబితే అది చేయడమే మా పని.- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఇవీ చూడండి..