మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భాజపాకు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు చెప్పారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భాజపా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. దేశంలోనే దళితులకు పది లక్షలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు కేసీఆరేనని పేర్కొన్నారు. దళిత నేతలంతా కేసీఆర్‌కు మద్దతు తెలపాలని మోత్కుపల్లి నర్సింహులు కోరారు.
ఇదీ చదవండి: రైతు బీమా మోసం: మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టి