Motorists Deaths in TS Road Accidents : రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే మృత్యువాత పడుతుండుతున్నారు. దీనికి అతివేగం, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలతో పాటు శిరస్త్రాణాలు ధరించకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా బైకుల పైనుంచి పడిన సందర్భాల్లో సున్నిత భాగమైన తలకు దెబ్బలు తగిలే ఎక్కువ మంది దుర్మరణం పాలవుతున్నారు. మరోవైపు అతివేగంతో నియంత్రణ కోల్పోతుండటమూ ప్రమాదాలకు ఆస్కారమిస్తోంది. ద్విచక్రవాహన ప్రమాదాల్లో యువత ఎక్కువగా మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు.. అధికవేగం.. రోడ్డుప్రమాదాల్లో ద్విచక్రవాహనదారుల మరణాలకు కారణాలను విశ్లేషిస్తే రోడ్డు ఇంజినీరింగ్ లోపాలకు, అతివేగం తోడవడం కనిపిస్తోంది. నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అంతర్గత రహదారులు ఛిద్రమై ప్రమాదాలకు బాట వేస్తున్నాయి. నగరాల్లో ప్రధాన రహదారులు గతుకులమయంగా మారాయి. ఇటీవలి వర్షాలకు పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో కార్లు, ఆటోలు, బస్సులు మినహాయిస్తే ద్విచక్రవాహనాలే ప్రమాదాల బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువయ్యాయి.
Telangana Road Accidents News : ఛిద్రమైన రహదారులపై తేలి ఉంటున్న చిన్న కంకర చిప్స్‌పై వెళ్తూ ద్విచక్రవాహనాలు జారి పడిపోతున్నాయి. అలాగే సాఫీ రహదారుల మధ్యలో ఒక్కసారిగా గుంతలు ఎదురవుతుండటమూ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదే సమయంలో వెనకనుంచి ఏవైనా వాహనాలు వస్తే వాటి కింద పడి ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువమంది శిరస్త్రాణాలు ధరించకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల జరిమానాల భయంతో రాజధానిలో రైడర్లతో పాటు వెనక కూర్చునేవారూ శిరస్త్రాణాలు ధరించడం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఆ స్పృహ కొరవడినట్లే కనిపిస్తోంది.
54 శాతం ద్విచక్రవాహనదారులే.. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 21,315 రోడ్డుప్రమాదాలు జరిగాయి. వీటిలో 7,557 మంది మృతిచెందగా.. 20,107 మంది క్షతగాత్రులయ్యారు. మొత్తం మృతుల్లో 4082 మంది, అంటే 54.01శాతం.. క్షతగాత్రుల్లో 50.06శాతం మంది ద్విచక్రవాహనదారులే కావటం తీవ్రతను తేటతెల్లం చేస్తోంది.