భారీ వర్షం భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. అకాల వర్షాలతో నగరంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలొదిలారు. వరణుడి ప్రభావంతో భాగ్యనగర వాసులు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు.
ప్రయాణం బేజారు:
నిత్యం రద్దీగా ఉండే చైతన్యపురి రహదారిపైకి వరద పోటెత్తింది. ఆదివారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు సాగించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో ..
1. జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ వరద ఉమామహేశ్వర కాలనీని ముంచేసింది. 642 ఇళ్లు మునకలోనే ఉన్నాయి.
2. ఎల్‌బీనగర్ జోన్ పరిధిలో చెరువు పోటెత్తి ఐదారు రోజులుగా హరిహరపురం పరిసరాల్లోని 14 కాలనీలు నీట మునిగాయి.
3. చాంద్రాయణగుట్ట, హషీమాబాద్, అల్‌జుబైల్ కాలనీల్లో నడుముల్లోతు నీరుంది. శనివారం రాత్రి గుర్రంచెరువు కట్ట తెగి భారీ ఆస్తినష్టం జరిగింది. బాబానగర్, ఉప్పుగూడ, శివాజీనగర్, క్రాంతినగర్ ప్రాంతాల్లో 6 వేల కుటుంబాలు నష్టపోయాయి. అలానే బోయిన్‌పల్లి రామన్నకుంట కట్ట శనివారం రాత్రి తెగింది. 15 కాలనీలు మునిగిపోయాయి.
ఈ నెల 13న రాత్రి గగన్‌పహాడ్ వద్ద వరదలో గల్లంతైన అయాన్‌ఖాన్(7) మృతదేహం ఆదివారం లభ్యమైంది. గగన్‌పహాడ్ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. అయాన్ వరద ఉద్ధృతిలో ఎక్కువ దూరం కొట్టుకుపోయి మట్టిదిబ్బలో కూరుకుపోయి ఉండోచ్చని కుటుంబ సభ్యులు, పోలీసులు 5 రోజులుగా గాలిస్తున్నారు. గల్లంతైన చోటు నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న బండ రాళ్లలో ఇరుక్కున్నాడు. స్థానికులు గమనించగా మృతదేహం కనిపించింది.
గండిపేట.. గేట్లు ఎత్తే అవకాశం
గండిపేట (ఉస్మాన్‌సాగర్)జలాశయం నీటి మట్టం ఆదివారం రాత్రికి 1786 అడుగులకు చేరింది. మరో 4 అడుగుల మేర పెరిగినట్లయితే గేట్లు ఎత్తే పరిస్థితి వస్తుందని అధికారులు తెలిపారు. చెరువు ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షపాతాన్ని బట్టి గేట్లు ఎత్తే పరిస్థితి తెలుస్తుందని పేర్కొంటున్నారు.
- గ్రేటర్‌లో వరద ప్రభావం (ఇప్పటి వరకు)
- ముంపునకు గురైన కుటుంబాలు 37,409
- అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 1,50,000 భోజనాల పంపిణీ
- వరదనీటిలో ఉన్న కాలనీలు/ బస్తీలు 2000- 2500
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు 1,20,000-1,45,000
- నీటిలో చిక్కుకున్న వాహనాలు 5.5లక్షలు
- కొట్టుకుపోయిన వాహనాలు 5,000-5,500
- కనిపించకుండా పోయిన వ్యక్తులు 40-45
- మృతులు 17