సచివాలయ కార్యాలయాల తరలింపు కోసం బూర్గుల రామకృష్ణారావు భవన్లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఆయా శాఖల అధికారుల సూచనలకనుగుణంగా పనులు జరుగుతున్నాయి. మరమ్మత్తు పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరమ్మతులు పూర్తయ్యేందుకు మరో రెండు వారాల సమయం పడుతుందని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.
మరికొంత డబ్బు కావాలి
భవనంలో టాయిలెట్లు, లిఫ్ట్లు, విద్యుత్ వంటి పలు పనులు కొనసాగుతున్నట్లు అధికారులు సీఎస్ జోషికి వివరించారు. భవనం లోపల, బయట రంగులు కూడా వేయనున్నామని తెలిపారు. మరమ్మతుల కోసం మరికొంత డబ్బు కావాలని కూడా కోరినట్లు సమాచారం.
సర్వం సిద్ధం
బీఆర్కే భవన్లో ఏ అంతస్తులోకి ఏ శాఖను తరలించాలనే విషయమై సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే ఓ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. సచివాలయం నుంచి దస్త్రాలు, ఫర్నీచర్, ఇతర సామాగ్రిని తరలించేందుకు ప్రైవేట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ జాబితాను కూడా ఆర్ అండ్ బీ శాఖ సిద్ధం చేసింది.
సమయం పడుతుంది
బీఆర్కే భవన్లో ఐటీ సేవలకు సంబంధించి ఐటీ శాఖ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు అందించింది. ప్రస్తుతం సచివాలయంలో ఉన్న సర్వర్లు, ఇతర పరికరాలు పాతబడి పోయాయని... కొత్త సర్వర్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ పేర్కొంది. సేవలు మరింత సులభతరం, వేగవంతం చేసేలా స్మార్ట్ ట్రాక్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. వీటికోసం 17 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. కొత్త ప్రాంగణంలో నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు పక్షం రోజుల సమయం పడుతుందని... అయితే పనులు పూర్తి కాకపోయినా శాఖల తరలింపు ప్రక్రియ యధావిధిగా చేసుకోవచ్చని కూడా వివరించింది.
మరోమారు సమీక్ష
ఆర్ అండ్ బీ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా మరమ్మతులు, తరలింపు ప్రక్రియపై ఈరోజు మరోమారు అధికారులతో సీఎస్ జోషి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కార్యాలయాల తరలింపు తేదీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- ఇదీ చూడండి : కశ్మీర్ 'హోదా రద్దు, విభజన'కు పార్లమెంట్ ఆమోదం