పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నా.. నా వల్ల మీ అందరికీ ఇబ్బంది కలగొచ్చు.. కొన్నాళ్లు ఇంటికి రాను.. ఎక్కడో ఒకచోట ఉంటా.. మీరు జాగ్రత్తగా ఉండండి.. అని చెబితే నా భార్య నాతో పెద్ద యుద్ధమే చేసింది. ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టింది. పొద్దున్నే ఎప్పుడో పోతా.. అసలే వేసవి. చెమటకు మాస్కులు, గ్లౌజ్‌లు తడిచిపోయి మంట పెడుతున్నా భరిస్తున్నాం. రాత్రి ఇంటికి వచ్చే ముందు ఫోన్ చేసి వేడి నీళ్లు బయటపెట్టమంటా. బయటే బట్టలు తీసేసి డెట్టాల్ నీళ్లలో ముంచి, నా ఫోన్, వాచీ, మాస్క్, కళ్లజోడు, పర్సు, బండి తాళంతో సహా అన్నింటిని శానిటైజర్‌తో శుభ్రం చేసుకుని, డెట్టాల్ నీళ్లతో స్నానం చేసి భయంభయంగా ఇంట్లోకి వెళ్లడం.. డాడీ అంటూ దగ్గరకు రాబోయిన నా ఐదేళ్ల కొడుకును ఎత్తుకోలేని పరిస్థితి.. ‘వద్దు నాన్నా దగ్గరకు రాకు’ అని ఆ పసి మనసును గాయపరచాల్సిన దుస్థితి. ఓ ముద్ద తిని వారికి దూరంగా పడుకుని.. పొద్దునే లేచి మళ్లీ డ్యూటీకి వెళ్లడం.. ఇంతా చేస్తున్నా మాకు బాధగా లేదు. ఈ విపత్కర పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన ప్రజల్ని రక్షించుకోవాలి.. అని ఎంత కష్టమైనా ఇష్టంగా పని చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంత వరకూ బయటకు రాకండి, ఒకవేళ తప్పనిసరై వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.. దూరం పాటించండి. - ఓ పోలీసు విన్నపం ఇది.
పగటిపూట మండే ఎండలు.. చీకటి పడితే దోమలు.. నిలువుకాళ్ల ఉద్యోగం.. విరామమెరుగని పోరాటం.. కరోనా కట్టడి కోసం జనం ఇళ్లు దాటి బయటకు రాకుండా చూడడానికి పోలీసులు నిరంతరం విరామమెరుగకుండా కాపలా కాస్తున్నారు. నిర్బంధం కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా వైద్యులతోపాటు పోలీసులు రాత్రీపగలూ తేడా లేకుండా పనిచేస్తున్నారు. కరోనా బెంబేలెత్తిస్తున్నా.. అంతుబట్టని శత్రువులా విరుచుకుపడే అవకాశం ఉన్నా.. ఆ మహమ్మారిని మట్టుపెట్టడం కోసమన్నట్లు ఖాకీలు లాఠీలు పట్టుకొని వీధుల్లో గస్తీ కాస్తున్నారు. అక్కడక్కడా లాఠీలు ఝుళిపించడంపై విమర్శలు వినిపిస్తున్నా.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పోలీసు సేవలు అనిర్వచనీయమైనవి. లాక్‌డౌన్ నేపథ్యంలో జనం రోడ్లమీదకు రాకుండా చూడడం కోసం రాష్ట్రంలో దాదాపు 40,000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. పగలు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉన్నా కిరాణా సరకులు, కూరగాయల వంటి వాటి కోసం ఇంకా ఎంతోమంది బయట తిరుగుతూనే ఉన్నారు. ఇదే సందుగా కొంతమంది దూర ప్రాంతాలకు కూడా వెళుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా బయట తిరుగుతున్న వారిని గుర్తించి కట్టడి చేసే బాధ్యత పోలీసుశాఖపై పడింది.
అదనపు బాధ్యతలు..
ఎక్కడైనా కరోనా అనుమానితులు ఉన్నట్లు సమాచారం వస్తే వైద్య సిబ్బందికి సాయంగా వీరు కూడా వెళుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని, ఇటీవల దిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరై వచ్చినవారిలో కరోనా అనుమానితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించడం, మిగతావారిని ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంచినప్పుడు వారి కదలికలు గమనించే బాధ్యత కూడా పోలీసులదే. వణికిస్తున్న కరోనాకు వెరవకుండా కీలకమైన ఈ విభాగం నిర్వహిస్తున్న పాత్ర నిజంగా అభినందనీయమే.
లాఠీ ఝుళిపించడంపై వివాదం..
అక్కడక్కడా లాఠీలు ఝుళిపిస్తుండటం, విచక్షణరహితంగా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగేవారి విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ ఒక్కోసారి నిజంగానే పనిమీద వచ్చిన వారు కూడా లాఠీ దెబ్బలు తింటున్నారు. కారణాలేవైనా అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇంకాస్త సంయమనం చూపిస్తే బావుంటుందనేదే అందరి కోరిక.
ఇవీ చూడండి: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం ఆ జంతువుపైనే..!