అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి నుంచి తమను కాపాడాలని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచర్ల మేకలమండి మొండెదారు సంక్షేమ సంఘం సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కోరారు. కార్పొరేటర్లు రసాల వెంకటేశ్ యాదవ్, బింగి జంగయ్య యాదవ్‌ల ఆధ్వర్యంలో మొండెదారు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిన్న బాలయ్య యాదవ్, ముఖ్య సలహాదారు పోచయ్య, సభ్యులు లింగస్వామి యాదవ్, బాబు కుర్మ, స్వామి కుర్మలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
కబేలా బయట తాము గొర్రెలు, మేకలను విక్రయించుకొని జీవనం సాగిస్తున్నామని మంత్రికి వారు వివరించారు. కబేలాకు సంబంధంలేని వ్యక్తులు తమపై దౌర్జన్యం చేస్తూ ఎలాంటి రశీదులు ఇవ్వకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మంత్రికి పిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి.. ఈ విషయంపై తగు విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.