Modi tour in Bheemavaram: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తోంది. సోమవారం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరంలో ప్రధాని మోదీ సభ జరగనుంది. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమవరం సమీపాన ఉన్న కాళ్ల మండలం పెదఅమిరంలో భారీ వేదిక సిద్ధమైంది. ఇదిలావుంటే భీమవరంలో వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. సభా ప్రాంగణమంతా తడిసి ముద్దయింది. సభా ప్రాంగణంలో బురద లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సభా ప్రాంగణాన్ని ఏపీ రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు.
రాజు వేగేశ్న ఫౌండేషన్‌కు చెందిన 16 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది కూర్చునేందుకు టెంట్లు వేశారు. వేదికపై ప్రసంగాలను వీక్షించేందుకు గ్యాలరీలతోపాటు భీమవరం పట్టణ పరిసరాల వరకు ఎల్‌ఈడీ స్క్రీన్లు బిగించారు. ప్రాంగణానికి ఓ వైపు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. తోపులాటలు లేకుండా ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రతి టెంటుకూ ఎదురుగా రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు.
- సభా ప్రాంగణానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో 4 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ప్రముఖులు కూర్చునే వేదిక సిద్ధమైంది. మరో వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
జన సమీకరణకు 9 వేల బస్సులు.. ప్రధాని సభకు ప్రజలను తీసుకొచ్చి, తిరిగి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపు 2వేల బస్సులు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు విద్యా సంస్థలు, ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 7 వేల బస్సులను అల్లూరి సీతారామరాజు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తోంది. కోనసీమ నుంచి 2వేల వాహనాలు రానున్నాయి. కృష్ణా, తూర్పుగోదావరి, ఏలూరు తదితర జిల్లాలతో పాటు హైదరాబాద్, చిత్తూరు, బెంగళూరు, చెన్నై, దిల్లీ తదితర నగరాల నుంచి ప్రజలు రానున్నారు. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రముఖులు వస్తారని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు.
చిరంజీవి పర్యటన ఖరారు..: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ప్రధాన మంత్రి మోదీ సభకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి ఉత్సవ కమిటీకి సమాచారం అందినట్లు తెలిసింది.
ప్రధానితో అల్లూరి కుటుంబసభ్యులు: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రధానమంత్రికి పరిచయం చేసి సత్కరించే కార్యక్రమాన్ని క్షత్రియ పరిషత్ చేపట్టింది. ఈ మేరకు క్షత్రియ పరిషత్ నర్సీపట్నం సభ్యులు డీవీఎస్ రాజు అల్లూరి జిల్లా నడుంపాలెం లంకవీధి జీడితోటల్లో ఉంటున్న గంటం దొర మనువడు బోడి దొర కుటుంబ సభ్యులను కలిసి ఆహ్వానించారు. ఏ ప్రభుత్వం వీరిని ఆదుకోలేదని..,ఇప్పటికి వీరు పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారని డీవీఎస్ రాజు అన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా తమ వంతుగా సాయం చేసేందుకు వీరిని ప్రధాని వద్దకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: