నాటు కోడికి గిరాకీ
గతంలో ఇంటింటా నాటుకోళ్లు ఉండేవి. పండగొచ్చినా, చుట్టాలొచ్చినా.. ఆ రోజు వాటిలో ఒకటి కూరగా మారేది. ఇప్పుడు మళ్లీ కోడికూతలు వినిపిస్తున్నాయి. నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. రుచి కారణంగా వీటి మాంసం కిలో రూ.450-500 వరకూ పలుకుతోంది. గుడ్డు రూ.10పైనే అమ్ముతున్నారు.
గానుగ నూనెకు డిమాండ్
మార్కెట్లో దొరికే రిఫైన్డ్ నూనెల వినియోగంపై రకరకాల వాదనలు నెలకొన్న నేపథ్యంలో క్రమేపీ అందరి దృష్టీ గానుగ నూనెల పైకి మళ్లుతోంది. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ కొత్త గానుగలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటికి సగటున యూనిట్ వ్యయం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అవుతోంది. గానుగల వద్ద పల్లీ నూనెతోపాటు కొబ్బరి, పొద్దుతిరుగుడు, ఆవ, నువ్వుల నుంచి నూనెలు తీస్తున్నారు. ఇంట్లో నూనె తయారీకి గ్రైండర్ పరిమాణంలో ఉండే యంత్రాలు (కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎక్స్‌ట్రాక్టర్) వచ్చాయి. వీటి ధర రూ.16వేల నుంచి రూ.25వేల మధ్య ఉంటోంది. గంటకు 4-8 కిలోల గింజలు ఆడతాయి.
ఆరోగ్యంపై పెరుగుతున్న జాగ్రత్త
పల్లెలు.. పట్టణాలు.. నగరాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలకు ఆరోగ్యంపై జాగ్రత్త పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. రోజూ వాడే బియ్యం నుంచి వడ్డించుకునే కంచాల వరకూ.. అన్నింట్లోనూ పద్ధతులు పాటిస్తున్నారు. బియ్యం వాడకంలోనూ మార్పులొచ్చాయి. ఆరోగ్యస్పృహ పెరుగుతున్న కొద్దీ ముడి బియ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నవార, బహురూపి, నారాయణ కామిని, రత్నచోడి, గని, పులాసర్.. తదితర రకాలను వాడుతున్నారు. వీటిలో కొన్ని ముడి బియ్యంగా.. మరికొన్ని సింగిల్ పాలిష్‌గా వినియోగిస్తున్నారు. బియ్యం ఆడేందుకు చిన్న యంత్రాలూ వస్తున్నాయి. వీటిని ఇళ్ల వద్దకే తెచ్చి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇస్తున్నారు. కాళ్లతో తొక్కితే.. దంపుడు బియ్యం వచ్చే పరికరాలూ ఉన్నాయి.
కొర్రన్నం.. రాగి సంకటి..
జొన్నన్నం, రాగి సంకటి, కొర్రన్నం.. 50ఏళ్ల కిందట ప్రధాన ఆహారం ఇదే. తెల్ల బియ్యం రాకతో కనుమరుగైన ఈ చిరు ధాన్యాలు ఇప్పుడు మళ్లీ విరివిగా వినియోగంలోకి వస్తున్నాయి. బియ్యం బదులు ఒక పూట చిరుధాన్యాల భోజనంపై ఆసక్తి కనబరుస్తున్నారు. జొన్న, సజ్జ, రాగి తదితర చిరుధాన్యాల అటుకులకూ, వీటితో చేసే చిరుతిండ్లకూ డిమాండు పెరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
మిద్దె పంటలు
కూరగాయలు పండించేటప్పుడు వాటిపై రకరకాల పురుగుమందులు చల్లడం, త్వరగా పెరిగేందుకు కృత్రిమ రసాయనాల వాడకం గురించి రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో సొంతంగా పంటలు పండించుకుని వాడుకోవాలన్న ఆలోచన నుంచి మొదలైనవే మిద్దె పంటలు. ఎవరింట్లో వారే కూరగాయలు పండించటానికి ఆసక్తి కనబురుస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పాదులు.. ఇలా అన్నింటినీ మిద్దెమీదే సాగు చేస్తున్నారు. నాలుగైదు అడుగుల ఎత్తులోనే పండ్లనిచ్చే మామిడి, బత్తాయి, నిమ్మ తదితర రకాలూ వచ్చాయి.
దేశవాళీ ఆవు పాలు లీటరు రూ.100
దేశవాళీ ఆవు నెయ్యి కిలో రూ.4,800 వరకు పలుకుతోంది. వీటిలో ఒంగోలు, గిర్ ఆవుల నెయ్యి వినియోగం ఎక్కువగా ఉంది. కిలో నెయ్యి తయారీకి 30 లీటర్ల వరకు పాలు అవసరమని రైతులు వివరిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలోనూ ఈ రకం నెయ్యినే వాడుతున్నారు. విజయవాడలోని ఒక సేంద్రియ ఉత్పత్తుల దుకాణంలో.. కాచిన ఆవు పాలు గ్లాసు రూ.20. వీటిని తాగేవారిలో యువతే ఎక్కువ. పల్లెల్లోనూ లీటరు రూ.100 వరకు పలుకుతున్నాయి.
స్టీలు ప్లేట్లు, గ్లాసులతో బంతి భోజనాలు
బంతి భోజనాల్లో కొంతకాలంగా ప్లాస్టిక్ స్థానంలో పేపర్ వినియోగిస్తున్నారు. కానీ ఏవైనా ఒకసారి వాడి పారేసే వాటివల్ల కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. దీంతో.. ఇటీవలి కాలంలో చాలామంది మళ్లీ స్టీలు కంచాలు, గ్లాసుల వాడకంవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న ఫంక్షన్ల నుంచి పెళ్లిళ్ల వరకూ అన్నిచోట్లా స్టీలు కంచాల్లో వడ్డించడం మొదలవుతోంది. పెరుగుతున్న పర్యావరణ స్పృహే దీనికి కారణం. ఖర్చు కాస్త ఎక్కువైనా అతిథులకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. బంతి భోజనం అంటే ఒకప్పుడు పులిహోర తప్పనిసరి. తర్వాత ఆ స్థానాన్ని వెజ్ బిర్యానీ ఆక్రమించింది. సగ్గుబియ్యం పాయసం, పులిహోర మళ్లీ నోరూరిస్తున్నాయి. కొందరు కొర్ర, అంటుకొర్ర అన్నం, పాయసం చేసి మరీ వడ్డిస్తున్నారు.
తిరగలి మళ్లీ వచ్చింది
పల్లెల్లోనే కాదు.. మహానగర లోగిళ్లలోకీ మళ్లీ తిరగళ్లు అడుగు పెడుతున్నాయి. బయట కొంటున్న పప్పుల్లో వేర్వేరు పదార్థాలు కలుస్తున్నాయని, అందువల్ల గింజలు కొనుక్కుని తామే ఇంట్లో విసురుకుంటే నాణ్యమైన పప్పులు వస్తాయని గృహిణులు నమ్ముతున్నారు. అందుకే తిరగళ్లు ఎక్కడ దొరుకుతాయని ఆరా తీసి.. వెళ్లి తెచ్చుకుంటున్నారు. సెనగలు, మినుములు, పెసలను విసురుకోవడం మళ్లీ ఓ ట్రెండులా మారుతోంది.
* గతంలో కందులు నానబెట్టి, పూర్తిగా ఎండిన తర్వాత మంగళం (రంధ్రంతో కూడిన కుండ)లో వేయించి తిరగలిపై పప్పు విసిరేవారు. వీటికి మంచి రుచి, వాసన ఉంటాయి. రాను రాను మిల్లుల్లో తయారైన కందిపప్పు వినియోగం పెరిగింది. రైతులూ కందుల్ని మిల్లులో ఇచ్చి పప్పు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ తిరగళ్లలో పప్పు విసురుకునే విధానం మొదలైంది. రోట్లో రుబ్బిన పిండి బాగా ఒదుగు అవ్వడంతో పాటు.. ఆహార పదార్థాలు మెత్తగా, రుచిగా ఉంటున్నాయని మహిళలూ వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.
సమస్తం.. సేంద్రియం
రసాయన మందులు వాడకుండా పండించే కూరగాయలు, ఆకుకూరలు, ఆహార ధాన్యాల వాడకమూ పెరిగింది. జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య ఆధారిత ఉత్పత్తులనే పంటలకు పిచికారీ చేస్తున్నారు. వినియోగదారులు పొలాల వద్దకే వెళ్లి సాగు విధానం చూసి కొంటున్నారు. సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే వీటి ధరలు 30-50% వరకు అదనం. సేంద్రియ పదార్థాలకు ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాల్లో పేరున్న సంస్థలూ ఈ తరహా ఉత్పత్తుల తయారీలోకి అడుగు పెడుతున్నాయి.
రాగి చెంబులు, ఇత్తడి పాత్రలు.. మట్టి పిడతలు
నిజానికి అల్యూమినియం పాత్రల కంటే.. మట్టి పిడతల ధరలు ఎక్కువ. అయినా వాటిని అమెజాన్‌లోనూ ఆర్డర్ పెట్టి ఆన్‌లైన్లో తెప్పించుకుంటున్నారు. ఇవి రూ. 50-500 వరకు ఉంటున్నాయి. కొన్ని రకాల పాత్రలైతే రూ.1,500 వరకు ఉన్నాయి. అన్నం వండటానికి, పాలు కాచేందుకు మట్టిపాత్రలు వాడుతున్నారు. హోటళ్లలో మంచినీళ్లకూ ఎర్రమట్టి గ్లాసుల్నే వినియోగిస్తున్నారు. మట్టి పాత్రలతో కళాయిలూ అందుబాటులోకి వచ్చాయి. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే పాత్రలన్నీ కలిపితే రూ.2వేల వరకు అవుతాయని అంచనా.
* రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం ఆరోగ్యకరమని పరిశోధనల్లోనూ రుజువు కావడంతో.. వీటినే ఉపయోగిస్తున్నారు. రాగి బాటిల్స్, రాగి కూజాలూ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. శుభకార్యాల్లోనూ రాగి గ్లాసులను బహుమతులుగా అందిస్తున్నారు.
* ఒకప్పుడు వంటకు ఇత్తడి పాత్రలనే ఉపయోగించేవారు. ధర తక్కువ కావడం, బరువు లేకపోవడంతో తర్వాత అల్యూమినియం పాత్రల వాడకం పెరిగింది. అయితే వీటిలో వంట చేయడం వల్ల ఆల్జిమర్స్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని పరుశోధనలు చెబుతుండటంతో.. కొన్ని కుటుంబాలు మళ్లీ ఇత్తడి పాత్రల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. అన్నం, పాలు, ఇతర ఆహార పదార్థాలకు కావల్సిన పాత్రలకు రూ.3వేలకు పైగానే అవుతుంది. చెక్క గరిటెల వినియోగమూ పెరిగింది.
గానుగ నూనెల వాడకం పెరిగింది
తాడేపల్లి మండలం పెనుమాకలో మేం యూనిట్ పెట్టి ఏడాదిన్నర అవుతోంది. గతంతో పోలిస్తే గానుగ నూనెల వాడకం పెరిగింది. కల్తీ లేకుండా స్వచ్ఛమైన నూనె పట్టించుకోవచ్చనే అవగాహన ఏర్పడింది. కొంతమంది దగ్గరుండి నూనె తీయించుకుంటున్నారు. ఎక్కువ మంది వేరుసెనగ నూనెకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తర్వాత పప్పునూనె, కొబ్బరినూనె అడుగుతుంటారు. -వీరారెడ్డి, నవీన్‌రెడ్డి, గానుగ నిర్వాహకులు
పిండి వంటలకూ ఇదే
మొన్నీ మధ్యే మా అన్నయ్య వాళ్లు గానుగ నూనె తెచ్చారు. బాగుందని చెప్పడంతో మేమూ కొంటున్నాం. మంచి వాసన, వంటలు రుచిగా ఉంటున్నాయి. అరిసెలు వండటానికి ఇదే తీసుకెళ్దామని వచ్చా. -సవరం వీరయ్య, ఐనవోలు, గుంటూరు జిల్లా
గానుగ నూనెలు ఉత్తమం
మార్కెట్‌లో దొరికే వివిధ రకాల రిఫైన్డ్ వంట నూనెల్లో బీటీ పత్తి గింజల నూనె, పెట్రోలియం జెల్లీతో పాటు వేర్వేరు ఉత్పత్తులు కలుపుతున్నారు. పలు రకాల అనారోగ్యాలకు ఇవి కారణమవుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెరగడంతో గానుగ నూనెలపై దృష్టి పెడుతున్నారు. మేం పదేళ్ల కిందటే కృష్ణాజిల్లా తరకటూరులో ఎద్దుల గానుగ ఏర్పాటుచేశాం. కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నూనె తయారీ యంత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. లీటరు రూ.250 చొప్పున వస్తుంది. గానుగ నూనె ఎంతో శ్రేష్ఠమైంది. పప్పు (పొట్టు తీసిన నువ్వులతో) నూనె, కొబ్బరి, కుసుమ నూనె కూడా మంచివే. -విజయ్‌రామ్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు
ఇదీ చదవండి: పందెంలో ఏ కోడి ఎప్పుడు గెలుస్తుంది.. కోడిశాస్త్రం ఏం చెబుతోంది!