దిల్లీ శివారులోని నోయిడాలో ఉంటారు నేహ, రాహుల్ రస్తోగి దంపతులు. నేహా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసేది. రాహుల్ కార్పొరేట్ సంస్థలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉద్యోగి. 2013లో లఖ్‌నవూలో ఉంటున్న రాహుల్ తండ్రికి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన వెళ్లిపోయారిద్దరూ. పెద్దాయనను ఆసుపత్రిలో చేర్పించారు. గండం గడిచింది. ఇంటికి తీసుకొచ్చారు. తరచూ వైద్యులను సంప్రదించాల్సి వచ్చేది. ఈసీజీ కోసం ఎక్కడికో వెళ్లడం ఇబ్బంది అనిపించింది. ఇంట్లోనే ఈసీజీ తీసుకునే చిన్న యంత్రం ఏదైనా ఉందా అని అంతటా వెతికారు. ఎక్కడా దొరకలేదు. తనే ఆ యంత్రాన్ని ఎందుకు కనుక్కోకూడదు అనుకుంది నేహ. భర్తతో తన ఆలోచనను పంచుకుంది. ఆయనా సరే అన్నాడు. దీంతో అగట్సా పేరుతో ఓ స్టార్టప్ మొదలుపెట్టింది. ఇంట్లోనే ప్రయోగశాల ఏర్పాటు చేసుకుంది. భర్త సహకారంతో సాంకేతికతను జోడిస్తూ పోర్టబుల్ ఈసీజీ యంత్రాన్ని తయారుచేసింది. దానికి సంకేత్‌లైఫ్ 2.0 అని నామకరణం చేసింది.
విఫలం చెందినా...
యంత్రమైతే తయారైంది.. అది ఎంత కచ్చితత్వంతో పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంది. తన చిట్టి యంత్రాన్ని తీసుకెళ్లి వైద్యులకు చూపించింది నేహ. దీనివల్ల ఏ ఉపయోగం లేదన్నారు వైద్యులు. ఇది గుండె లయను మాత్రమే తెలియజేస్తుందని, ఛాతీనొప్పి, గుండెపోటు మధ్య తేడాను గుర్తించలేదని చెప్పేశారు. నేహ నిరుత్సాహపడలేదు. రెండేళ్లు పరిశోధనలు కొనసాగించింది. పరికరంలో మార్పులు, చేర్పులు చేసింది. సరికొత్త పరికరాన్ని మళ్లీ ఆవిష్కరించింది. ఆసుపత్రుల్లో ఉండే ఈసీజీ యంత్రాల మాదిరిగానే ఇదీ పనిచేస్తుంది. ఆ యంత్రాలకు ఉండే ఎలక్ట్రికల్ వైర్లను రోగి ఛాతీ, ఇతర ప్రదేశాల్లో అమర్చి.. గుండె లయను తెలుసుకుంటారు. కానీ, సంకేత్‌లైఫ్ 2.0 ఎలాంటి వైర్లు, సాంకేతిక నిపుణుల సాయం అవసరం లేకుండా.. పనిచేస్తుంది. యంత్రానికి రెండు సెన్సర్లు ఉంటాయి. వాటిపై రోగి రెండు బొటన వేళ్లు నొక్కి ఉంచితే చాలు. గుండె పనితీరును ఎలక్ట్రికల్ సిగ్నళ్లు రికార్డు చేస్తాయి. ఆ వివరాలను చరవాణికి చేరవేస్తాయి. యాప్ సాయంతో ఈసీజీ చూసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో అందుబాటు..
సంకేత్‌లైఫ్ 2.0 పరికరం జేబులో ఇమిడిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగి ఈసీజీ క్షణాల వ్యవధిలో తీసుకోవచ్చు. మొబైల్ ద్వారా డాక్టర్లకు పంపించి.. సలహాలు పొందొచ్చు. నారాయణ హృదయాలయ, ఎయిమ్స్‌లో సంకేత్‌లైఫ్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే దాదాపు 8,000 పరికరాలు విక్రయించింది నేహ. యాప్ ద్వారా సేవలు పొందిన రోగుల సంఖ్య లక్షన్నర పైమాటే! ఆలంబనగా చేసుకొని నేహ చేసిన సృష్టి... ఆమెను విజేతగా నిలబెట్టింది.
ఇదీ చదవండి: చైనాకు వత్తాసు పలికేలా ప్రధాని ప్రకటన: కాంగ్రెస్