ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం తెరాస ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ఇంఛార్జ్ సీహెచ్. ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, తెరాస నాయకుడు అభిషేక్ రాజ్‌తో కలసి ప్రారంభించారు.
అనంతరం గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓటరు నమోదు కార్యక్రమాల్లో ప్రతిఒక్కరు పాల్గొనాలని మంత్రి తలసాని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం అత్యంత ప్రాధాన్యమైన విషయమని... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల ప్రభావంతో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు తెరాస కైవసం చేసుకోవడం తథ్యమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.