MLC Duvvada controversial comments: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి భవన సముదాయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలు తెదేపా నేతలు ధ్వంసం చేశారన్నారు. మంగళవారం రాత్రి టెక్కలిలో శిలాఫలకాలు తామే ధ్వంసం చేశామని.. 'ఏం చేసుకుంటారో చేసుకోండి' అంటూ ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఎదుట వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. ధర్మాన కృష్ణదాస్ వారించడంతో.. కలెక్టర్‌కు క్షమాపణ కోరారు.
2019లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ భవన నిర్మాణాన్ని ఇదివరకే ప్రారంభించారు. అప్పట్లో ఆయన వేసిన ఫలితాలను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో తెదేపా నేతలు బుధవారం టెక్కలిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి పోలీసులకు వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో తామే శిలాఫలకాలు విరగ్గొట్టామని ఎమ్మెల్సీ ప్రకటించడంపై దుమారం రేగింది. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌పై ఉపముఖ్యమత్రి ధర్మాన కృష్ణదాస్ చలోక్తులు విసిరారు. నారా లోకేష్ బఫూన్ అని, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒకేసారి 50 మందిని కొట్టినట్లు చేయలేరన్నారు. 70 ఏళ్ల వయసున్న తనతో ఫైటింగ్ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
అసలేం జరిగింది: టెక్కలి లో తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తతకు దారి తీసింది. టెక్కలిలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆసుపత్రి భవన సముదాయం 2019లో అప్పటి మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అయితే పెండింగ్ పనులు ప్రస్తుతం పూర్తిచేసి బుధవారం సాయంత్రం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో ఆసుపత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవ సమయాల్లో వేసిన శిలా ఫలకాలను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది. శిలా ఫలకాల ధ్వంసం నిరసిస్తూ ఈరోజు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసు నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఆస్పత్రి వరకు ర్యాలీగా వెళుతున్న నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శిలా ఫలకాలను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చేపట్టాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతిపత్రం అందించారు.