ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి అధ్యక్షతన మాదిగల జాగృతి రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి తాటికొండ రాజయ్య జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చేసిన తీర్మానానికి చట్టబద్దత చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మాదిగల రిజర్వేషన్లతోపాటు, బీసీ, మైనార్టీ, గిరిజన వర్గాల రిజర్వేషన్ల సాధన కోసం ప్రజలను జాగృతి చేయడానికి ఈ యాత్ర చేపట్టామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రిజర్వేషన్ల సాధన కోసం ప్రజలు ఐక్యం కావాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీలు అధికంగా ఉన్నప్పటికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావాలని ఎస్సీ కమిషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. బీసీలకు 50 శాతం, మైనార్టీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, బోయలను ఎస్టీ జాబితాలో, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం, వడ్డెర్లకు వడ్డెర కార్పొరేషన్ తదితర డిమాండ్లతో 33 జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
మార్చి 3న భవనగిరిలో బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో స్పందించకుంటే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజయ్య ఈ సందర్భంగా డప్పు కొట్టి దరువేశారు.
ఇదీ చూడండి : నిరుద్యోగులను మోసం చేస్తున్నారు : రాణిరుద్రమ