రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘానికి కోహెడలోని సర్వే నెంబర్ 507లో ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి కేటాయించింది. ఆ స్థలంలో చేపట్టే గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ ఛైర్మన్ కొత్తకుర్మా సత్తయ్యతో కలిసి శంకుస్థాపన, భూమిపూజ చేశారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్రూట్ మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో గోడౌన్లు నిర్మించడం రైతులకు ఎంతో ఉపయుక్తమని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. నాబార్డు, తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం సంయుక్తంగా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ, గోడౌన్లు నిర్మిస్తున్నాయని తెలిపారు. తొలి విడతలో రూ.3.24కోట్ల వ్యయంతో గోడౌన్ల నిర్మాణం చేపట్టి.. నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే తక్కువ ధరకే రైతులు పంటలను నిల్వచేసుకోవడానికి ఈ గోడౌన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
'ఎఫ్ఎస్సీఎస్ తుర్కయంజాల్కి సంబంధించిన బ్యాంక్ ఛైర్మన్, అధికారులు ప్రతిపాదన పెట్టగానే ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి కేటాయించింది. ఇవాళ ఆ స్థలంలో కోల్డ్ స్టోరేజీ, గోడౌన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రైతులకు శుభసూచకం. ఈ గోడౌన్ల నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తే రైతులకు చాలా మేలు చేకూరుతుంది. పండ్ల మార్కెట్ పక్కనే గోడౌన్లు నిర్మిస్తుండడం ద్వారా రైతులకు మంచి జరుగుతుంది. అన్నదాతలు తక్కువ ధరకే తమ పంటను ఈ కోల్డ్ స్టోరేజీ, గోడౌన్లలో నిలువ చేసుకోవచ్చు.'-మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్, రంగారెడ్డి జిల్లా సహకార అధికారిణి ధాత్రిదేవి, ఆర్డీవో వెంకటాచారి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి, రైతుబంధు జిల్లా ఛైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, బ్యాంకు డైరెక్టర్లు, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: