చరిత్రలో ఎన్నడూ చూడని భారీ వరదలు ఈ సారి వచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాల వల్లే వరదలు వచ్చాయని విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలపై మంత్రులు మండిపడ్డారు. ఇప్పడు ఆరోపణలు చేస్తోన్న నేతల హయాంలోనే అక్రమ కట్టడాలు నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టిన భవనాలన్నీ చట్టానికి లోబడి నిబంధనల ప్రకారమే కట్టిన కట్టడాలని తెలిపారు. వరద ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు గ్రేటర్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. గత పాలకులు వ్యవహరించిన తీరు వల్లే హైదరాబాద్‌కు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు దేవుడులాంటి సీఎం కేసీఆర్ ఉన్నారని, ఎవ్వరూ అధైర్యపడొద్దని చెప్పారు.
‘వరద బాధితులు అధైర్యపడొద్దు’
1908 తర్వాత మళ్లీ అలాంటి వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజల్లోనూ ఉంటున్నారని తెలిపారు. 80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షసూచన ఉందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 550 కోట్లు నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్