పేద ప్రజలు కూడా గొప్పగా బతకాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్, శ్రీరామ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి... కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ప్రారంభించారు. 264 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
సరైన మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గాంధీనగర్, శ్రీరామ్‌నగర్ వాసులకు సొంతింటి కలను సాకారం చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని తలసాని పేర్కొన్నారు. కంటోన్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దూసుకుపోతున్నాయన్నారు. కంటోన్మెంట్లో నెలకొన్న సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. త్వరలోనే కంటోన్మెంట్ బోర్డును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రెండు పడక గదుల ఇళ్ల విషయంలో మాట్లాడుతున్న భాజపా నాయకులు కంటోన్మెంట్ ప్రాంతానికి వచ్చి చూడాలని తలసాని ఆహ్వానించారు.