సకల హంగులతో నూతన సచివాలయ నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భవనాలు, నిర్మాణ సామగ్రి పరిశీలనకు ప్రతినిధి బృందాన్ని దిల్లీ పంపించింది. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో ఆ శాఖ ప్రధాన ఇంజినీర్ (ఈఎన్‌సీ) గణపతిరెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్ శశిధర్, ఆర్కిటెక్ట్ అస్గర్, షాపూర్‌జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ శుక్రవారం దిల్లీలో పర్యటించారు. ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్, పార్లమెంటు సహా ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రుల కార్యాలయాలు కొలువైన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్‌లను పరిశీలించింది.
బ్రిటిషు కాలంలో నిర్మించినా ఆయా భవనాలు నేటికీ దృఢంగా, రాచఠీవితో నిలిచి ఉండడంతో వాటికి వినియోగించిన రాళ్లు, వాటిని ఎక్కడి నుంచి తెప్పించారు, నిర్మాణంలో వినియోగించిన సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా భవనాల నిర్మాణానికి వినియోగించిన ఎర్రరాళ్లను పరిశీలించారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోక హాల్, పార్లమెంట్ పరిసరాల్లోని ఫౌంటెయిన్లు, పచ్చిక బయళ్లు(లాన్లు), అలంకరణ సామగ్రి, కార్పెట్లనూ పరిశీలించి వాటి నిర్వహణపై ఆరా తీశారు. ఆయా భవనాల్లో వినియోగించిన నీటిని శుద్ధిచేసి పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లకు వాడుతున్న తీరును ప్రతినిధి బృందానికి కేంద్ర అధికారులు వివరించారు. రాజస్థాన్‌కు చెందిన పలు రకాల రాళ్ల నమూనాలను గుత్తేదారులు తెలంగాణ భవన్‌లో మంత్రికి, అధికారులకు చూపించి వాటి నాణ్యతను వివరించారు.
కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనెతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో రోడ్డు భవనాల శాఖ రహదారులను జాతీయ రహదారులుగా మార్పు, రాష్ట్రంలో జాతీయ రహదారులుగా ప్రకటించిన వాటికి నంబర్ల కేటాయింపు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించారు.
ఇదీ చదవండి : న్యాయవాద దంపతుల కేసులో మలుపులు... బయటపడుతున్న నిజాలు...!