నిరంతరం ప్రజల్లో ఉండేది... అభివృద్ధి కోసం పాటుపడేది ఒక్క తెరాస పార్టీ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కొంతమంది నీటిమీద బుడగలా వచ్చి పోతుంటారని... వారు శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హైదరాబాద్లోని సనత్నగర్ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు సమన్వయంతో వ్యవహరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని... ఓటమి చెందామని అధైర్య పడొద్దని ఉత్సాహం నింపారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు.
ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, కొలను లక్ష్మి, ఆకుల రూప, ఉప్పల తరుణి, హేమలత, మహేశ్వరి, పార్టీ డివిజన్ల అధ్యక్షులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.