రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా సీఐఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్కొండ తారమతి వద్ద నుంచి అనంతగిరి వరకు నిర్వహిస్తున్న బైక్ రైడ్‌ను మంత్రి ప్రారంభించారు. సుమారు 100 రైడర్స్ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ రైడ్‌లో దేశవ్యాప్తంగా నైపుణ్యం గల బైక్ రైడర్స్ పాల్గొన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో కొండపోచమ్మ, రంగనాయక సాగర్, కాళేశ్వరం వంటి వాటిని పర్యాటక కేంద్రాలుగా చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రైడర్స్‌తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ద్విచక్రవాహనం నడిపి అందరిని ఉత్సాహపరిచారు. అనంతరం నిజాం కాలం నాటి తారమతి బారదరిని పరిశీలించారు. తారమతి అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు అందేలా చూస్తామని తెలిపారు.