మేథావులు, కళాకారులు, రచయితలు, కవులు ఇలా ఎంతో మంది కళరంగానికి తమ జీవితాలను అంకితం చేసి సంరక్షిస్తూ వస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా రూపొందించిన తెలంగాణలో సంగీతం, తెలంగాణలో నృత్యం, తెలంగాణలో నాటకం అనే మూడు పుస్తకాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ బాదిమి శివకుమార్, తెలంగాణ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీధర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సంగీత, నృత్యం, నాటకం రంగాల్లో విశేష అనుభవం కలిగిన ఎంతో మంది పరిశోధన చేసి... అన్వేషించి ఈ మూడు గ్రంథాలను రాశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. ఇలాంటి గ్రంథాలు భవిష్యత్‌లో కళరంగంలోకి వచ్చే వారికి ఉపయోగపడుతాయన్నారు. నాటక అభివృద్ధి పూర్వకాలంలో వేయించిన శాసనాలు, ఆలయ శిల్పాలు, కావ్యాల్లోని ఆధారాలను అన్వేషించి పలువురు పరిశోధకులు చేత ఈ వ్యాసాలు వ్రాయించి ఈ సంకలనాల్లో చేర్చారన్నారు.
కరోనా కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు స్థంబించిపోయాని సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్ అన్నారు. సంగీత, నృత్యం, నాటకం వంటి కళ రూపాలను భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలను రాయించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఇదీ చూడండి: