ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ, ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో-3ని కొనసాగించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. 2000వ సంవత్సరంలో తీసుకొచ్చిన ఈ జీవోను... లాక్డౌన్ సమయంలో సుప్రీంకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత న్యాయస్థానం ప్రారంభమైన మొదటి రోజే రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
జీవోను కొట్టివేసిన వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తీర్పు కాపీలు తెప్పించుకొని... రాష్ట్ర అడ్వకేట్ జనరల్, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, సీనియర్ న్యాయవాదులు, అధికారులు, నిపుణులను సంప్రదించి సమగ్ర సమాచారంతో పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనుల్లో అనుకున్న అభివృద్ధి జరగలేదని... వారికి న్యాయం జరిగేలా ఈ జీవోను పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేలుతున్న భాజపా రాష్ట్ర నేతలు... జీవో పునరుద్ధరించేలా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: గల్వాన్‌లో స్కెచ్ వేస్తే కాలాపానీలో రిజల్ట్..!