కొవిడ్ మహమ్మారి (covid) సోకి చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలు ఏ ఒక్కరూ వీధిన పడకుండా మానవత్వంతో వ్యవహరించి... ఆ పిల్లలను ప్రభుత్వం తరపున సంరక్షించాలని... రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ (Sathyavath rathod) అన్నారు. కొవిడ్ నేపథ్యంలో శిశువులు, బాలింతలు, గర్భిణీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యం, సంరక్షణపై హైదరాబాద్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శితో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు.
కరోనా రెండో దశలో చాలామంది మహిళలు ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు కొవిడ్ బారిన పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు చనిపోవడం వల్ల కొంతమంది పిల్లలు అనాథలు అవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గర్బిణీలకు కొవిడ్ వస్తే వెంటనే శాఖ తరఫున సూచనలు అందించాలని పేర్కొన్నారు.
పిల్లల వివరాలు సేకరించండి:
కొవిడ్ వల్ల చనిపోయిన తల్లిదండ్రుల పిల్లల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి... వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. వారికోసం ఇప్పటికే ట్రాన్సిట్ హోమ్స్ ఏర్పాటు చేశామని... వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు గానీ, హెల్ప్ లైన్ 04023733665కు సమాచారం అందిస్తే వారిని సంరక్షిస్తామని తెలిపారు. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ఆరేళ్ల పిల్లల కోసం..
తమ పర్యవేక్షణలో కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన దాదాపు రెండు వందల మంది పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరేళ్ల పిల్లల కోసం 11 శిశు విహార్‌లు, బాలికల కోసం 35 చిల్డ్రన్ హోమ్స్, మరో 7 చిల్డ్రన్ హోమ్స్ వివిధ కేటగిరిల పిల్లల కోసం నిర్వహిస్తున్నామన్నారు. అనాథ పిల్లలకు పూర్తి స్థాయిలో స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
70శాతం రిజర్వేషన్లు..
గురుకులాల్లో అనాథలు, నిరాశ్రయుల అడ్మిషన్లకు మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కాలేజీలో ఇంటర్ బోర్డు సంయుక్త సహకారంతో అనాథ బాలికలకు 70శాతం రిజర్వేషన్లు కల్పించి... వారికి రెసిడెన్షియల్ వసతి కూడా కల్పిస్తుమని పేర్కొన్నారు.
స్కాలర్ షిప్..
ఐసీపీఎస్ పథకం కింద ప్రతి జిల్లాలో 40 మందికి మూడేళ్ల వరకు రెండు రూపాయల చొప్పున స్కాలర్ షిప్ అందిస్తున్నామన్నారు. వీటన్నింటితో పాటు ఇప్పుడు కొవిడ్ వచ్చిన తల్లిదండ్రుల పిల్లలను కూడా ట్రాన్సిట్ హోమ్‌లో పెట్టి సంరక్షిస్తున్నామని... తల్లిదండ్రులకు కొవిడ్ తగ్గిన తర్వాత మళ్లీ వారిని ఇంటికి చేర్చుతున్నామని మంత్రి చెప్పారు.