రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉర్దూ మాధ్యమ పాఠశాలల సమస్యలపై మజ్లిస్ శాసనసభ్యులు, అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్షించారు. ఉర్దూ ఉపాధ్యాయ ఖాళీల వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక డీఎస్సీ తర్వాత కూడా పోస్టులన్నీ భర్తీ కాకపోతే డీ రిజర్వేషన్ చేసి జనరల్ కేటగిరీలో భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనార్టీలకు ప్రవేశాలు కల్పిస్తామని సబిత హామీ ఇచ్చారు. ఉర్దూ మాధ్యమ పాఠశాలలకు టీశాట్, విద్యా నిపుణ ఛానెళ్ల ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. హైదరాబాద్లోని పలు ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో కనీస సదుపాయాల కల్పన కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫలక్నూమలో ప్రత్యేక క్రీడా ప్రాంగణం నిర్మిస్తామన్నారు. చంచల్గూడ, ఫలక్నూమల్లో డిగ్రీ కళాశాలల భవనాల నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: హలో పేరెంట్స్.. మీ అబ్బాయికి ఈ విషయాలు చెప్తున్నారా?