Sabitha Indra Reddy Response: తెరాస నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన భూకబ్జాల ఆరోపణలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కబ్జాలు, ఆక్రమణలు జరిగితే.. ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు. తీగల కృష్ణారెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావటంలేదన్న సబిత.. ఈ అంశంపై తీగలతో మాట్లాడతామని వెల్లడించారు.
"మేం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం. ఏ విషయంలో.. ఎవరు కృష్ణారెడ్డిని తప్పుదోవ పట్టించారో తెలియదు. ఒకవేళ నిజంగానే కబ్జాలు జరిగి ఉంటే.. ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఎప్పటికీ కబ్జాలను ప్రోత్సహించదు. కృష్ణన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థంకాలేదు. ఈ విషయాన్ని మేం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించకుంటాం. ఇది పెద్ద విషయమేమి కాదు." -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
అయితే.. మీర్‌పేట్‌ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీగల కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు. అయితే.. ఇదంతా పెద్ద విషయమేమి కాదని.. కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించటం వల్లే జరిగిందని సబిత కొట్టిపారేశారు.
ఇవీ చూడండి: