నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న కాళేశ్వరం పనులపై రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో పనుల పురోగతిపై చర్చించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ప్యాకేజీ 20, 21 పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ పనులు పూర్తయితే నిజామాబాద్ జిల్లాలో లక్ష 97వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాల్లో వరుసగా 80 వేలు, 7 వేలు, లక్ష పదివేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పైపులైన్ పనులకు ఆటంకం కలిగించకూడదని, నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇరిగేషన్ సీఈ మధుసూదన్‌రావు, ఎస్ఈ ఆత్మారామ్, ఇతర అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఆర్థిక, వ్యవసాయ రంగాలపై మంత్రుల సమీక్ష