అగ్రవర్ణ పేద మహిళలకు చేయూత పథకం విస్తరించినట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 'ఈబీసీ నేస్తం'కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లకు రూ.670 కోట్లు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. సచివాలయంలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షత మంత్రివర్గ సమావేశం జరిగింది. 45-60 ఏళ్ల మధ్య ఉన్న అగ్రవర్ణ పేద మహిళలకు సాయం అందిచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్నినాని వివరించారు.
అసెంబ్లీ తీర్మానానికి నిర్ణయం..
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానానికి నిర్ణయించినట్లు పేర్నినాని తెలిపారు. జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ బోధనా ఫీజు చెల్లింపునకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. నెలవారీగా సంక్షేమ పథకాల అమలుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా 8 కోట్ల మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్..
'లక్ష 43 వేల మంది లబ్ధిదారులకు 300 చదరపు గజాల్లో అపార్టుమెంట్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1కే ఇంటి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇళ్లకు ఇప్పటికే చెల్లించిన రూ.469 కోట్లు వెనక్కివ్వాలని నిర్ణయించాం. ప్రైవేట్ లేఅవుట్లలో 5 శాతం భూమి పేదలకు కేటాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించింది. అనుమతి లేని లేఅవుట్ల కట్టడికి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. అనుమతి లేని లేఅవుట్లకు విద్యుత్, కుళాయి ఇవ్వం'.
- ఏపీ మంత్రి పేర్ని నాని
రైతుభరోసా కేంద్రాల ద్వారా సమస్య పరిష్కరించే కార్యాచరణకు కేబినెట్ ఆమోదించిదని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పంటల నిల్వకు రూ.2,170 కోట్లతో మల్టీ పర్పస్ స్టోరేజ్ సెంటర్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. వైఎస్సార్ స్టీల్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. రూ.10,802 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ఆమోదించినట్లు వెల్లడించారు. హైగ్రేడ్ స్టీల్‌కు 3,148 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ పార్కుకు భూమి కేటాయింపునకు ఏపీ కేబినెట్ ప్రతిపాదించిందని వివరించారు.
భూములు వాపసు...
కాకినాడ సెజ్‌కు భూములిచ్చి పరిహారం తీసుకోని వారికి భూమి వాపసు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాకినాడ రైతులకు 2,180 ఎకరాలు తిరిగిచ్చేందుకు కేబినెట్ ఆమోదించిందని స్పష్టం చేశారు. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదించిందన్నారు.
పట్టణాలు అందంగా..
"మున్సిపల్ ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణకు 2,700 వాహనాల సమకూర్చుకొనేందుకు కేబినెట్ నిర్ణయించింది. పట్టణాలను అందంగా తీర్చిదిద్దేలా 6 నెలల్లో కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. పుర, నగరపాలికల్లో రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని కేబినెట్ నిర్ణయించింది." అని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు.
100 రోజుల్లో చర్యలు..
అవినీతి ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునే కాలాన్ని 100 రోజులకు కుదిస్తూ చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఏపీ మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. కేసులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయని ఏసీబీ అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రవర్గం నిర్ణయించిందని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత